Railway Under Bridge at Vambay Colony: విజయవాడ నగరంలో వాంబే కాలనీ, సింగ్ నగర్, పాయకాపురం, రాధానగర్, కండ్రిక, ప్రకాష్ నగర్ ప్రాంతాల ప్రజలు వివిధ పనులు చేసుకునేందుకు నిత్యం నగరంలోకి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతాల ప్రజలు నగరంలోకి వచ్చేందుకు.. ప్రజల సౌకర్యం కోసం సింగ్ నగర్ వద్ద పై వంతెనను నిర్మించారు. కానీ ఈ పైవంతెన నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండటం వలన.. పనులకు సకాలంలో చేరుకునేందుకు ఈ ప్రాంత వాసులు ఎక్కువగా వాంబే కాలనీ వద్ద ఉన్న రైలు కట్టమీద నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదమని తెలిసిన తప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు.
వాంబే కాలనీ నుంచి నగరంలోకి రావాలంటే ఆటోకి రూ.100 నుంచి 120 చెల్లించాల్సి వస్తుందని.. అదే రైల్వే ట్రాక్ దాటితే సులభంగా గమ్యస్థానం చేరుకోవచ్చని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని.. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం, గెలిచిన తర్వాత పట్టించుకోకుండా ఉండటం పరిపాటిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాంబేకాలనీ పరిసర ప్రాంతాల వాసుల చిరకాల వాంఛ ఎన్నికల హామీగానే మిగిలిపోతోంది.
60వ డివిజన్ వాంబేకాలనీ - 30వ డివిజన్ దేవీనగర్లను కలుపుతూ ఆర్యూబీ నిర్మిస్తే.. నగరంలోకి వెళ్లేందుకు వీలుగా ఉంటుందని వాంబేకాలనీ, పాయకాపురం ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆటోనగర్ వైపు వెళ్లాలంటే సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఈ మార్గం 6 కిలో మీటర్ల మేర అదనంగా దూరం ఉండటంతో.. ప్రమాదకర పరిస్థితుల్లో రైల్వే ట్రాక్ దాటుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని.. అనేక సార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేదని స్థానికులు చెబుతున్నారు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తుందని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్యూబీ నిర్మాణం చేపట్టాలని 20 ఏళ్ల నుంచి కోరుతున్నా.. పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోకి డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేక ప్రమాదకర స్థితిలో రైల్వే ట్రాక్ దాటి నగరంలోకి వస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని వారు కోరుతున్నారు.
"ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే సిటీలోకి వెళ్లడానికి దగ్గర అవుతుంది. ఈ బ్రిడ్జ్ వస్తే.. వంతెనపై ట్రాఫిక్ కూడా తగ్గుతుంది". - స్థానికులు
"మేము 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ప్రతి రోజు ఇదే సమస్య. చూట్టూ తిరిగి వెళ్లాలంటే 120 రూపాయలు అవుతున్నాయి". - స్థానిక మహిళ
ఇవీ చదవండి: