Krishna River Management Board office at Vizag: సీఎం జగన్ చేస్తున్నఅనాలోచిత నిర్ణయాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే ఐ డోంట్ కేర్ అంటూ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా జగన్ ముందుకు వెళ్తున్నారు. అసలు కృష్ణానది లేని విశాఖలో.. కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత గోదావరి బోర్డును తెలంగాణకు, కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక దాన్ని విశాఖకు మార్చారు. దీనిపై అధికారపార్టీ ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో లేఖలు రాసినా సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయంతో పాలకులకు అసలు కృష్ణా నది ఎక్కడ ప్రవహిస్తుందో తెలుసా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కర్నూలు, విజయవాడల్లో ఏర్పాటుకు డిమాండ్లు..: తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయం ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలోనైనా కృష్ణాబోర్డు ఏర్పాటు చేయొచ్చు. కృష్ణాడెల్టా వ్యవస్థకు ప్రధాన కేంద్రమైన విజయవాడలోను పెట్టుకోవచ్చు. అసలు కృష్ణా పరీవాహకంతో ఏ మాత్రం సంబంధం లేని విశాఖలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం ఏమిటి? ఇది తగదని కర్నూలు జిల్లాలోని 8 మంది ఎమ్మెల్యేలు, మరో ఎమ్మెల్సీ ముఖ్యమంత్రికి, అధికారులకు లేఖలు రాశారు. కృష్ణా బోర్డును కర్నూలుకు తరలించాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ సాగునీటి సాధనసమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి సైతం కృష్ణాబోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటుచేయాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఏర్పాట్లు చేశారు. ఈ కార్యాలయం విజయవాడలోనే ఏర్పాటు చేయాలని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ డిమాండు చేశారు.
విశాఖలో 10వేల చదరపు అడుగులు: విశాఖలోని సీఈ కార్యాలయంలో కొత్తగా నిర్మిస్తున్న భవనం మొదటి అంతస్తులో కృష్ణాబోర్డుకు వసతి ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బోర్డు ఛైర్మన్, కార్యదర్శి, సిబ్బందికి కార్యాలయం ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్.. బోర్డు ఛైర్మన్ శివనందన్‌కుమార్‌కు లేఖ రాశారు. కృష్ణాబోర్డు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది.
ఆ అధికారులు అక్టోబరు 15వ తేదీ తర్వాత విశాఖ వచ్చి భవనాన్ని చూస్తారు. కావల్సిన సదుపాయాలేంటో చెబుతారు. అవన్నీ కల్పించేందుకు రెండు నెలలు పడుతుందని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. పాలకులకు అసలు కృష్ణానది ఎక్కడ ప్రవహిస్తుందో తెలుసా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహాబలేశ్వర్ వద్ద జోర్ గ్రామం సమీపంలో కృష్ణానది పుట్టింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.