పంట రుణాల బ్యాంకుగా మాత్రమే కాకుండా రైతు, రైతు కుటుంబాల అవసరాలు తీర్చేందుకు అన్ని విధాలా వారికి ఆర్ధిక భరోసాగా కల్పించేదుకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ఇందుకోసం ఖాతాదారులకు వివిధ రకాల వినూత్న పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి రూ.7,500 కోట్ల వ్యాపారాన్ని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని.. దాదాపు రూ.80 కోట్ల నికర లాభాన్ని ఆర్జించే దిశగా పలు సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
సహకార బ్యాంకు చట్టం ప్రకారం గత ఏడాది కాలంలో సాగుదారుని పంట భూమి తనఖాగా తీసుకుని.. తక్కువ వడ్డీకే రుణ సహాయాన్ని అందించే కార్యక్రమాలను అమలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. వడ్డీ వ్యాపారుల బారినపడి రైతులు కుదేలెత్తిపోకుండా వారికి అవసరమైన రుణ సహాయాన్ని వినూత్నంగా అమలు చేస్తోన్నందుకు జాతీయస్థాయిలో రెండో అత్యుత్తమ సహకార బ్యాంకుగా రిజర్వు బ్యాంకు గుర్తింపునిచ్చిందని అన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి పది వేల కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు వాణిజ్య బ్యాంకులకు దీటుగా.. అన్నదాతకు అండగా నిలవాలని సంకల్పించుకున్నట్లు వెంకటరావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'సహకర బ్యాంకుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి'