కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న వరద నీరు, వర్షాలు, వరద సహాయక చర్యలపై కలెక్టర్ ఇంతియాజ్ అన్ని శాఖల అధికారులతో టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కృష్ణా నదికి వరద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తక్షణమే వరద సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు.
కృష్ణా జిల్లా అంతటా అధికారులు వారు పని చేసే ప్రదేశాల్లోనే అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో త్రాగునీటికి, రాకపోకలకు, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా, ప్రాణ నష్టం, పంట నష్టం, పశు నష్టం లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెరువుల గట్లు తెగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, అంటువ్యాధులు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఉద్ధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్ళరాదని, వరద ప్రవాహ నీటిలో దిగడం, దాటడం చేయొద్దని కోరారు. పాడు బడిన పాత మట్టి గోడల వద్ద ఉండొద్దని... ప్రజలు త్రాగునీటిని కాచి, చల్లార్చి తాగాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు.
ఇదీ చదవండి: