కృష్ణా జిల్లా విజయవాడలోని కానూరు నారాయణ కెనడి పాఠశాల మైదానం శివనామస్మరణతో మారుమోగింది. హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్, ధర్మజ్యోతి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం... శివ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో... అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్యసంఘం... ఇస్కాన్ ఆధ్వర్యంలో కార్తీకదీపోత్సవం ఘనంగా నిర్వహించారు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో... సత్యనారాయణస్వామి తెప్పోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లు హంసవాహనంలో ఆశీనులై... పంపా సరోవరంలో ఊరేగారు. ఈ కమనీయ దృశ్యాన్ని... కొండలు, గుట్టలు ఎక్కి మరీ భక్తులు వీక్షించారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తెప్పోత్సవం... వశిష్ట గోదావరిలో ఘనంగా జరిగింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ ఇంద్రపుష్కరిణిలో... హంస నావికోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉషాపద్మినీచ్ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను ఇంద్రపుష్కరిణిలో హంసవాహనంపై 12 సార్లు ఊరేగించారు. అరటి దొప్పలపై దీపాలను వెలిగించిన మహిళలు... ఇంద్రపుష్కరిణిలోకి వదిలారు. కర్నూలు మున్సిపల్ పాఠశాల మైదానంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు.