గన్నవరం విమానాశ్రయంలో అధునాతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పర్యావరణ అనుమతులూ రావడంతో ప్రస్తుతం పునాదుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఇది అందుబాటులోకి వస్తే.. దేశీయ, అంతర్జాతీయ సేవలు ఒకేచోట పొందొచ్చు. ప్రస్తుతం ఈ సేవలకు వేర్వేరు టెర్మినల్ భవనాలు వినియోగిస్తున్నారు. మొత్తం రూ.605 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో రూ.470 కోట్లు భవన నిర్మాణానికి వెచ్చించనున్నారు. వచ్చే 20ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్న భవనం రెండేళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యం. 2018 డిసెంబరులోనే దీనికి భూమిపూజ చేసినా అన్ని రకాల అనుమతులు రావడానికి ఇంతకాలం పట్టింది. పనులు పూర్తయితే రాష్ట్రంలోనే అతిపెద్ద టెర్మినల్ కానుంది. కొత్త టెర్మినల్‌లో 14 ఇమ్మిగ్రేషన్, 4 కస్టమ్స్ కౌంటర్లు, 24 చెక్‌ఇన్ పాయింట్లు, 6 ఏరో వారధులు, డిపార్చర్, అరైవల్ బ్లాకుల్లో బ్యాగేజీ కన్వేయర్లు, అంతర్జాతీయస్థాయి బ్యాగేజీ హ్యాండ్లింగ్ వ్యవస్థ వంటి అధునాతన సౌకర్యాలు ఉంటాయి. నిర్మాణం పూర్తయితే అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు ఆసక్తి చూపించొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రధాని డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మాణం
ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రధాని నరేంద్రమోదీ డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) బోర్డు సభ్యులు కాశం వెంకటేశ్వర్లు తెలిపారు. విమానాశ్రయంలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనాన్ని, రన్‌వే విస్తరణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. 2022కి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, ఆ వేడుకల్లో గన్నవరంలో చేపట్టిన ఈ అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు.
ఇదీ చదవండి:
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం