High court on Srisailam trust board: శ్రీశైలం ఆలయ ట్రస్టుబోర్డులో ఈ నెల 14న జరగాల్సిన ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే ఇచ్చింది. బోర్డు సభ్యుల నియామక ఫైల్‌ను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సభ్యుల అర్హతలేమిటి?. వారిని ఎవరు నామినేట్ చేశారు? వారి నియామకం నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా తేల్చాల్చిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మూడు వారాలపాటు ప్రమాణ స్వీకారం వద్దని తేల్చిచెప్పింది. విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనారావు ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. శ్రీశైలం దేవస్థానానికి ట్రస్టుబోర్డు(పాలకమండలి)ను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 3న జీవో 84ను జారీ చేసింది. ఈ క్రమంలో ఈనెల 14న సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో 84ను సవాలు చేస్తూ.. కర్నూలు జిల్లా గుగుంజాయ్ తండాకు చెందిన కె.శ్రీనివాసులు నాయక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బోర్డులో ఒక్క గిరిజనుడికి స్థానం కల్పించలేదని పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ.. గిరిజనులకు శ్రీశైలం దేవస్థానానికి చారిత్రాత్మకంగా సంబంధం ఉందన్నారు. దేవాదాయ చట్టంలోని సెక్షన్17(5) ప్రకారం శ్రీశైలం పాలకమండలిలో కనీసం ఒక్క గిరిజనుడై ఉండాలన్నారు. దేవాదాయశాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది రజనీరెడ్డి వాదిస్తూ.. ఆ సెక్షన్ ట్రస్టుబోర్డులో కనీసం 50 శాతం ఇతర వర్గాలుండాలని చెబుతుందేకాని.. నిర్దిష్టంగా ఓ వర్గం ఉండాలని పేర్కొనలేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు అవుతారు.. తదితర వివరాల్ని తేల్చాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్న న్యాయమూర్తి.. బోర్డు సభ్యుల నియామకానికి సంబంధించి పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఇదీ చదవండి
Perni nani meets mohanbabu: సినీ నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని