కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. బ్లాక్ ఫంగస్ కేసులు, వ్యాక్సినేషన్ అంశాలపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేసింది. కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలనే వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో మూడో దశలో కరోనా కల్లోలం ఎదురైతే సమర్థంగా కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
నిర్థరణ పరీక్షలు వేగంవంతం చేయాలి: హైకోర్టు
కరోనా నిర్ధరణ పరీక్షలు మరింత వేగవంతం చేస్తూ ఒప్పంద నర్సులకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెమ్‌డెసివిర్ వినియోగ కాలపరిమితి పెంపును కోర్టు దృష్టికి తెచ్చిన సర్కార్.. ఇంజెక్షన్ల వినియోగ కాలపరిమితి ఏడాదికి పెంచుతూ డీసీఐ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. ఈ సందర్భంగా కరోనా వేళ మానసిక రోగులకు ఎలాంటి వైద్య చికిత్సలు అందిస్తున్నారని కోర్టు ఆరా తీసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కొవిడ్ నియంత్రణ చర్యలపై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
వారికి వెయిటేజీ ఇస్తాం: సర్కార్
కరోనా నివారణ చర్యల్లో భాగంగా.. ముందస్తుగానే 26 వేల 325 మంది వైద్య సహా ఇతర సిబ్బందిని నియమించామని న్యాయస్థానం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. పీజీ మెడికల్ విద్యార్థుల సేవలకు భవిష్యత్‌లో వెయిటేజ్ ఇస్తామన్న సర్కార్.. 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు, 109 మరణాలు నమోదైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం సుమారు 1300కిపైగా కేసులు క్రియాశీలంగా ఉన్నాయని.. మూడో దశలో పిల్లలు కరోనా బారిన పడనున్నారనే అంశం నిర్ధరణ కాలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని హైకోర్టుకు వివరించింది.
curfew extended: కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. ఆ సమయంలో బయటికొస్తే చర్యలు!