కృష్ణా జిల్లాలో నివర్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న మామిడి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లకుండా తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యానశాఖ సూచించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పంటల స్థితిగతులను పరిశీలించారు. పూత, మొగ్గ దశలో ఉన్న మామిడికి తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
లీటర్ నీటిలో బావిస్టన్ 2 గ్రాములు, మల్టీకే 3 గ్రాములు, ఇమిడాక్రోపిడ్ 0.5 ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలని ఉద్యానశాఖ సూచించింది. 15రోజులపాటు ఈ మందుల ప్రభావం మామిడిపై ఉంటుందని తెలిపింది. తర్వాత వర్షాలు పడినా తెగుళ్లు రావని చెప్పింది.
వానలకు ముందు ఎండలు తీవ్రంగా ఉన్నందున మిరపలో తెల్లదోమ, ఇతర వైరస్‌ల ప్రభావం కనిపిస్తోంది. వర్షాల కారణంగా తెల్లదోమ తగ్గుతోంది. అయితే రాబోయే రోజుల్లో కాయ కుళ్లు, కొమ్మ ఎండు తెగుళ్లు లేకుండా ఉండేందుకు మెర్వాన్ 240 ఎం.ఎల్ ఎకరానికి స్ప్రే చేయాలని తెలిపింది. కస్టోడియా లీటరుకు 2 గ్రాములు, అగ్రోవిన్ మాక్స్ 3 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే 40 రోజుల వరకు తెగుళ్లు ఆశించకుండా పంటను సంరక్షించుకోవచ్చని ఉద్యానశాఖ ఏడీ దయాకరబాబు తెలిపారు.
ఇవీ చదవండి..