‘అందుబాటులోని రికార్డుల ప్రకారం వాటిని దేవాదాయ శాఖ భూములుగా పరిగణించలేం. ఆ భూముల్లో వందల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు జరిగాయి. పంచాయతీ అనుమతితో లేఅవుట్లు వేశారు. గుడివాడ బైపాస్‌రోడ్డు కోసం సేకరించిన భూమికి రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పరిహారం చెల్లించారు. రికార్డుల ప్రకారం ఆ భూములు దేవాదాయశాఖ పరిధిలో లేవు. వాటిని నిషేధిత 22ఏ జాబితా పరిధిలో చేర్చడం సరికాదు. వారసత్వం ప్రకారం హక్కులు లభిస్తాయి..’
రూ.250 కోట్ల విలువైన 25 ఎకరాల దేవాదాయశాఖ భూములపై కృష్ణా జిల్లా కమిటీ ఇచ్చిన నివేదిక ఇది. కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ కె.మాధవీలత, గుడివాడ ఆర్డీఓ జి.శ్రీనివాసరావు, దేవాదాయశాఖ విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ ఈ కమిటీలో సభ్యులు. గుడివాడ సమీపంలో దేవాలయ భూములుగా భావిస్తున్న వాటి విషయంలో అనుభవదారులకు అనుకూలంగా కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరుగుతోంది. అనుభవదారుల్లో ఓ ప్రజాప్రతినిధి బంధువుల పేర్లమీద 5 ఎకరాలు ఉన్నాయి. మొత్తం 25 ఎకరాలకు నిరభ్యంతర ధ్రువీకరణ పొందేందుకు దేవాదాయశాఖ కమిషనర్ వద్ద దస్త్రం సిద్ధమవుతోంది. ఇప్పుడైనా న్యాయస్థానంలో పోరాడతారా..? లేక కబ్జాదారులకు కట్టబెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఆలస్యంగా మేల్కొన్న దేవాదాయశాఖ
కృష్ణాజిల్లా గుడివాడ శివారులో ఇనాం భూములు ఉన్నాయి. ఇవి వేణుగోపాలస్వామి, భీమేశ్వరస్వామి ఆలయానికి చెందినవిగా చెబుతున్నారు. ఈ ఆలయం పరిధిలో దేవదాసీలకు ఇనాం కింద 1860లో 30 ఎకరాలు ఇచ్చారు. వలిపర్తిపాడులో సర్వే నంబరు 272, 294, మల్లాయపాలెం సర్వేనంబరు 4లో ఈ భూములున్నాయి. 1933 వరకు భూములకు రికార్డులు లేవు. 1933లో 37 మందికి వ్యక్తిగత పట్టాలుగా ఇచ్చారు. 1942లో ఇనాం భూములను రద్దు చేసినా, వీటిని దేవాలయాలు స్వాధీనం చేసుకోలేదు. తర్వాత ఇవి పలువురి చేతులు మారాయి. 2017లో దీనిపై దేవాదాయ శాఖకు ఫిర్యాదులు వచ్చాయి. అప్పుడు మేల్కొన్న అధికారులు అవన్నీ దేవాదాయశాఖ భూములని రెవెన్యూ అధికారులకు నివేదించారు. దీంతో రికార్డుల డిజిటలైజేషన్‌లో భాగంగా వాటిని 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. 1980లో వలిపర్తిపాడు మీదుగా నిర్మించిన గుడివాడ బైపాస్ రహదారికి ఈ భూముల్లో 4.40 ఎకరాలు సేకరించారు. అప్పటికి ఆక్రమణలో ఉన్నవారికి పరిహారం చెల్లించారు. ప్రస్తుతం ఈ భూములపై నిషేధం కొనసాగడంతో కొంతమంది దేవాదాయశాఖ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వాస్తవాలు తేల్చాలంటూ కలెక్టర్ నివాస్‌కు అర్జీ పంపారు.
త్రిసభ్య కమిటీ ఏర్పాటు
దీనిపై వాస్తవాలు నిగ్గుతేల్చాలని ముగ్గురు సభ్యులతో కలెక్టర్ కమిటీ వేశారు. ఈ కమిటీ తమ నివేదికను కలెక్టర్ ద్వారా దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపింది. నివేదిక అనుభవదారులకు అనుకూలంగా ఉందని తెలిసింది. 1980లో రహదారికి ఇచ్చిన పరిహారంతో పాటు, ఆ భూముల్లో సాగు చేస్తున్నవారు చెల్లించిన పన్ను రసీదులు వారికే అనుకూలంగా ఉన్నాయని తెలిసింది. 2017 తర్వాత దేవాదాయశాఖ ట్రైబ్యునల్‌కు వెళ్లింది. 13 కేసుల్లో ట్రైబ్యునల్ దేవాదాయశాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే 2017కు ముందు జరిగిన లావాదేవీల రికార్డులు లేవంటూ ట్రైబ్యునల్ తీర్పును అధికారులు ఇప్పుడు సరిగా పట్టించుకోలేదని తెలిసింది. ఆ భూముల్లో ప్రస్తుతం సాగు లేదు. ఈ విషయమై అధికారులు మౌనంగా ఉంటున్నారు. మంత్రి ప్రమేయం ఉండటంతో సున్నితమైన అంశంగా కొట్టిపారేస్తున్నారు. కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ కె.మాధవీలతను ‘ఈనాడు, ఈటీవీ భారత్’ సంప్రదించగా.. అందుబాటులో ఉన్న రికార్డులు, పాత దస్త్రాలను పరిశీలించి అనుభవదారులకు అనుకూలంగా నివేదిక ఇచ్చామని ధ్రువీకరించారు.
ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్వోసీలు?
ఎన్వోసీలు జారీచేసే విషయంలో అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములను పర్యవేక్షించేందుకు కమిషనరేట్‌లో సంయుక్త కమిషనర్ (ఎస్టేట్స్) పోస్టు ఉంది. కొద్దినెలల కిందటి వరకు భూములపై పట్టున్న ఓ అధికారి ఆ బాధ్యతలు చూశారు. అయితే రాయలసీమకు చెందిన అమాత్యుని నియోజకవర్గ పరిధిలోని ఒక ఆలయ భూమికి ఎన్వోసీ ఇవ్వాలని ఒత్తిళ్లు వచ్చాయి. ఆయన కుదరదని దస్త్రంపై రాసేశారు. దీంతో ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించి వేరే బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి: