ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కోచింగ్ తీసుకుంటున్నవాళ్లు, పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లలో చాలామంది వయోపరిమితి దాటేస్తోంది. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ల ఆలస్యంపై ఆందోళన చెందుతున్నారు. ఎప్పటినుంచో విడుదల చేయాల్సిన 9 నోటిఫికేషన్లు... ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని భావించిన అభ్యర్థులు... కాలయాపనతో తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. సంబంధిత బిల్లు ఈ ఏడాది జనవరి 8న లోక్‌సభలో ఆమోదం పొందింది. ఆ చట్టం ప్రకారం మార్చి 8 తర్వాత భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే అప్పట్లో ఎన్నికల కోడ్ కారణంగా ఈడబ్ల్యూఎస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వలేదు. అందువల్ల ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు నిలిపేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సీ అడుగు ముందుకు వేయలేకపోతోంది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. వయోపరిమితి దాటిపోతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్నారు.