మహిళలు పురుషులతో సమానంగా పనిచేయగలరనే ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు రైల్వేశాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రైల్వేశాఖ ఆదేశాలతో అన్ని డివిజన్లలోని ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 5 డివిజన్లలో... ఈచ్ ఫర్ ఈక్వల్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ డివిజన్ పరిధిలో పూర్తిగా మహిళా సిబ్బందితో కృష్ణా ఎక్స్‌ప్రెస్ నడిపారు. విజయవాడ, తిరుపతి నగరాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో రైలు డ్రైవర్ నుంచి టికెట్ కలెక్టర్లు, తనిఖీ, భద్రతా సిబ్బంది, స్టేషన్ మాస్టర్ వరకూ అన్ని బాధ్యతలనూ పూర్తిగా మహిళలే నిర్వర్తించారు. తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా రైలు నడిపి ఉన్నతాధికారులు, ప్రయాణికుల అభినందలను మహిళా ఉద్యోగులు అందుకున్నారు.
మహిళా సిబ్బందిని ప్రోత్సహించేందుకు గతంలోనూ విజయవాడ డివిజన్ పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఏడాదిన్నరగా పూర్తిగా మహిళా సిబ్బందితోనే రామవరప్పాడు రైల్వే స్టేషన్ నిర్వహిస్తోంది. ఇదే స్ఫూర్తితో అతి త్వరలో విజయవాడ-గూడూరు మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలును పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందితోనే నడపనున్నట్లు విజయవాడ డివిజన్ డీఆర్ఎం పి.శ్రీనివాస్ తెలిపారు. తమ డివిజన్‌లో 1800 మంది మహిళా ఉద్యోగులు కీలక విభాగాల్లో పని చేస్తున్నారని, రైలింజన్ రిపేర్ సహా భారీ బరువులు మోయటంలో పురుషులతో సమానంగా బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు. బాధ్యతల నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచిన మహిళలను మహిళా దినోత్సవం రోజున ఉన్నతాధికారులు అభినందించనున్నారు.