ఈటీవీ భారత్: టీటీడీ పాలక మండలి నిర్ణయం మీకేమనిపిస్తుంది ?
ఎంపీ: ఆస్తులు అమ్మకాన్ని నేను సమర్ధించను. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిని సమర్ధించరు. సామాజిక మాధ్యమాల్లో కూడా సేవ్ టీటీడీ అని ప్రచారం చేస్తున్నారు. దానిపై లక్షలాది మంది వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో వ్యాఖ్యలు కోటి దాటే అవకాశం ఉంది.
ఈటీవీ భారత్: భక్తుల నుంచి పెద్ద ఎత్తున రాబడి వచ్చే ఆలయం ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం..అలాంటప్పుడు ఎందుకు ఆస్తులు అమ్మాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది ?
ఎంపీ: ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే గతం(2015)లో కూడా కొన్ని కోట్ల విలువైన ఆస్తులు విక్రయించినట్లు ఇప్పుడే నాకు తెలిసింది. అది ప్రజలకు తెలియకుండా జరిగింది. తెలిసి ఉంటే ఇప్పటి మాదిరిగానే తీవ్ర వ్యతిరేకత వచ్చేది. గతంలో తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు..దానిని మా ప్రభుత్వం సరి చేసుకోవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేస్తున్నామని మా వాళ్లు కొందరు మాట్లాడడం సరికాదు అని నా అభిప్రాయం. గత ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టి ఓడింది. స్వామి వారి ఆస్తులు అమ్మి ఉంటే ఆయన శాపం కూడా తగిలి ఉండొచ్చు. ఆ తప్పులు మేము చేయడం సరైంది కాదు. తితిదే పాలకమండిలి నిర్ణయం తీసుకుంది. మా ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందని నేను అనుకోవడం లేదు.
ఈటీవీ భారత్: టీటీడీ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పార్టీలకతీతంగా అందరూ వ్యతిరేకిస్తున్నారు...సామాన్య ప్రజలు సైతం ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా... ఆ భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ?
ఎంపీ: మీరు అన్న మాటల్లో సామాన్య భక్తుల ఆవేదనను మనకు చెప్పడానికి కూడా వీలు లేదు. మా కుటుంబంలోని నలుగురు ఐదుగురు టీటీడీ చైర్మన్లుగా పని చేశారు. తిరుపతిలో మా కుటుంబ సభ్యులు చేసినన్ని సార్లు ఎవరూ చేయలేదు. బాపిరాజు మా నాన్నకు సోదరుడు, కనకరాజు మా తాతకు వియ్యంకుడు, గోకరాజు రంగరాజు స్వయంగా మా తాతగారికి అన్నయ్య... ఇలా మా కుటుంబ సభ్యులు టీటీడీ చైర్మన్‌లుగా పనిచేశారు. మా కుటుంబానికి వెంకటేశ్వర స్వామికి చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు ఎంపీగా ఉన్నందున మాకు దర్శనాలు సునాయాసంగా జరుగుతున్నాయి. రూపాయి రూపాయి కూడబెట్టి... స్వామి వారికిచ్చిన డబ్బులు ఈవేళ వడ్డీతో కలిపి రూ.14 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అదంతా పేదవాడు తన సంపాదనలో ఎంతోకొంత స్వామివారికి హుండీలో వేసిందే. రెండు, మూడు క్షణాలు మాత్రమే దైవ దర్శనం ఉన్నప్పటికీ దానితోనే భక్తులు సరిపెట్టుకుంటున్నారు. ఇది కాకుండా భక్తిభావంతో చాలామంది భూమిని కూడా దానంగా ఇచ్చారు.
ఈటీవీ భారత్: చాలామంది భక్తులు...తమ భూములు దేవుడికి ఇస్తే పుణ్యం దక్కుతుందన్న విశ్వాసంతో ఇస్తారు. ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టి భక్తి భావంతో ఇచ్చిన భూములను అమ్మాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?
ఎంపీ: ఆ ఆలోచననే తప్పు. గత ప్రభుత్వం చేసిన దానినే మేము అమలు చేస్తున్నామని అనడం ఇంకా తప్పు. పాలకమండలి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నేను నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడటం కుదరలేదు. ఎవరైతే ముఖ్యమంత్రితో దగ్గరగా ఉంటారో వారికి, శారద పీఠం స్వామి దృష్టికి కూడా తీసుకెళ్లాను. కచ్చితంగా భక్తులందరి అభిప్రాయం మేరకు రేపు, ఎల్లుండి ఎప్పుడైనా సరే...అతి త్వరలో ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక భక్తుడు ఇచ్చిన దాన్ని అమ్మే హక్కు ఎవరికి లేదు. చట్టాలు అనుమతి ఇచ్చినప్పటికీ వాటిని సవరించి అయినా...టీటీడీ భూముల్ని అమ్మడానికి వీలు లేకుండా...ఆదాయం ఎలా రావాలనే అంశంపై పరిశీలన చేయాలి.
ఈటీవీ భారత్: నిరర్ధక ఆస్తులు అంటున్నారు... నిరర్ధక ఆస్తులు ఎలా నిర్ధారిస్తారు?
ఎంపీ: అదే నాకు మిరాకిల్. ఎందుకంటే ఒక పరిశ్రమ మూతబడితే దానిని నిరర్ధక ఆస్తిగా అనడం మనకు తెలుసు. ఒక భూమి నిరర్ధక భూమి ఎలా అవుతుంది. నిరర్దక పరిశ్రమ అయితే కొనుగోలు చేసి విడిపించుకోవచ్చు. కాని నిరర్దక భూమి అంటే...ఎందుకు పనికిరాని భూమి. ఆలాంటప్పుడు కొనుగోలు చేస్తారని ఎలా ప్రశ్నించారు. ఒకవేళ భూమి పనికిరాదని భావిస్తే...ఆ భూమి దానం చేసిన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి... ఆ భూమిని అమ్మి డబ్బు ఇవ్వాలని కోరాలి. ఇందువల్ల మీ కోరిక నెరవేరుతుందని చెప్పాలి. కాని దానం చేసిన వ్యక్తికికాని, ఆ కుటంబ సభ్యులకు కాని చెప్పకుండా అమ్మడం సరికాదు. ఏదైనా భక్తుని ఇష్టప్రకారమే ఉండాలి. భగవంతుని మీద ప్రేమతో ఇచ్చిన భూమిని అమ్మటానికి టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. అది భగవంతుడికి పాలకమండలి చేసే ద్రోహం...అని నా అభిప్రాయం.
ఈటీవీ భారత్: టీటీడీ తీసుకొన్న నిర్ణయం ఎంతోమంది భక్తుల మనోభావాలతో ముడిపడివున్న వ్యవహారము...అలాంటప్పుడు ఎందుకు ముఖ్యమంత్రితో చర్చించకుండా పాలకమండలి స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున వివాదం కావాల్సి వచ్చింది?
ఎంపీ: ఇంత వివాదం అవుతుందని పాలక మండలి అనుకోలేదు. గత పాలకమండలి కూడా కొంత భూమిని అమ్మింది కదా వివాదం కాలేదని ఈ పాలక మండలి అనుకొని ఉండొచ్చు. అంతకన్నా నాకు కారణం కనిపించలేదు. కచ్చితంగా ముఖ్యమంత్రితో మాట్లాడితే.. భగవంతునికి సంబంధించిన అంశం విశ్వాసంతో కూడిన వ్యవహారం కాబట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. నేను ఒక ఉదాహరణ చెబుతున్నా... ప్రముఖ హీరోయిన్ కాంచన చెన్నై టీ నగర్‌లో రూ.10 కోట్లు విలువైన స్థలాన్ని దేవుడికి దానంగా ఇచ్చారు. ఈవోగా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు. ఆ విషయాన్ని నేను కూడా పత్రికల్లో చూశాను. ఆవిడ ఇచ్చిన స్థలంలో గెస్ట్ హౌస్ కానీ, లైబ్రరీ గాని, దేవస్థానంకు సంబంధించి నిర్మాణం జరపాలని కోరారు. తాను కూడా అందులో భాగస్వామ్యమై దేవుడికి సేవ చేసుకుంటానని విజ్ఞప్తి చేశారు. అది జరగలేదు. ఇప్పుడు ఆ ఆస్తిని కుడా బేరం పెట్టారు. కాంచన ఈ విషయంలో ఎంతో బాధపడుతున్నారు. కనీసం కాంచనతో కూడా చర్చించలేదు, మాట్లాడలేదు. ఇది ఎంతవరకు న్యాయం. ఇలా ఎంతోమంది ఎక్కడెక్కడో ఉన్న వారు...ఇక్కడున్న వెంకటేశ్వర స్వామికి భూములు రాసిచ్చారు. భూమి అనేది శాశ్వతం. డబ్బు అయితే ఒకటి రెండు రోజుల్లో కరిగి పోతుంది. ఆ భూమిని చూసినప్పుడల్లా ఆ కుటుంబ సభ్యులు తమ తాతలు ఇచ్చిందని భావించడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు ఇస్తే అలాంటి భావన కనపడదు. భౌతికంగా కనబడేది భూమి ఒక్కటే..డబ్బు పోయినా... మనిషి పోయినా... శాశ్వతంగా ఉండేది భూమి మాత్రమే.
ఈటీవీ భారత్: తితిదే మండలికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు రాకేష్ సిన్హా... టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డికి లేఖ రాశారు. ఎవరైతే భూమిని ఇచ్చారో వారందరి విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. ఇలా అమ్మాలనుకోవడం తప్పు... తక్షణమే ఆ నిర్ణయాన్ని ఆపండి అని లేఖలో ప్రస్తావించారు...మీరేమంటారు?
ఎంపీ: ఒక దాత ఇచ్చిన స్థలం మేము అమ్ముకుంటాం... మా మాట చెల్లుబాటు అవుతుందని అనుకుంటే...అది భూమిని దానం చేసిన దాత గుండెల్లో కత్తితో పొడిచిన దానికన్నా ఎక్కువ బాధగా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు టీటీడీ పాలక మండలిలో ఒకరు కూడా భూమి దానమిచ్చిన దాత ఉండరు. అందుకనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈటీవీ భారత్: మీరు ఒక ఎంపీగా కాకుండా... వైకాపా నాయకుడుగా కాకుండా.. ఒక సామాన్య పౌరుడిగా ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా... వ్యతిరేకిస్తారా..?
ఎంపీ: పాలకమండలి తీసుకునే నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా. అది అన్యాయం. వెంకటేశ్వరస్వామి భూముల జోలికి వెళ్లాలన్న ఆలోచన రావడమే తప్పు. ఆశ్చర్యం ఏమిటంటే మా సుబ్బారెడ్డి చైర్మన్ అవకముందు... గతంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ప్రతిఘటించారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విశృంఖలంగా తిరుగుతోంది. లక్షల మంది చూశారు దాన్ని. వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్తే పుట్టగతులు ఉండవు అని సుబ్బారెడ్డి చేసిన హెచ్చరికల వీడియో సర్క్యులేట్ అవుతోంది. అప్పట్లో అంత తీవ్రంగా ఖండించిన సుబ్బారెడ్డి ఇవాళ ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా తప్పులు చేయడం మానవ సహజం. కచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా వందకి వందశాతం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు.
ఈటీవీ భారత్: టీటీడీకి చాలా చోట్ల వేల కోట్లు విలువ చేసే భూములున్నాయి వాటి విషయంలో పాలకమండలి ఏలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే బాగుంటుందని మీరు ఒక ఎంపీగా, ఒక ప్రజా ప్రతినిధిగా...భావిస్తున్నారు?
ఎంపీ: మొదటిది ఆస్తుల పరిరక్షణ. రెండోది ఆస్తుల విలువ పెంపు. ఆస్తుల విలువ పెంపులో భక్తి భావాన్ని పెంపొందించేలా ఉండాలి. ఆస్తులను కాపాడుకుంటూ ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచన చేయాలి. దిల్లీలో టీటీడీ కళాశాల ఉంది. అక్కడ ఇంకా స్థలం ఉంది...శాశ్వతంగా ఆదాయం వచ్చేలా ఏవైనా నిర్మాణాలు చేయాలి. మనం మన ఆస్తులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటోమో....స్వామివారి డబ్బులు కూడా వృధా చేయకుండా చూడాలి. ఆదాయం వచ్చేలా మనం ఏం చేయాలో...ప్రత్యేకంగా దృష్టి సారించాలి. తర్వాత ఎక్కువ భూములు ఎవరైతే స్వామికి ఇచ్చారో....ఎవరికైతే ఆరాధన భావం ఉంటుందో..నిస్వార్ధంగా సేవ చేస్తారో...ఆలాంటి వారు పాలక మండలిలో సభ్యులుగా ఉండేలా చూడాలి. అది జరిగితే...ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ల భావాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో ఉత్తర భారత దేశంలో ఉన్న ఎంపీ రాకేష్ సిన్హ...దీనిమీద స్పందించడం సంతోషం. అదే సమయంలో మన సభ్యులు ఎవరు కూడా ఈ నిర్ణయాన్ని ఖండించకపోవడం బాధాకరం.
ఈటీవీ భారత్: పాలకమండలిలో ఎవరికైతే భక్తి భావము ఉంటుందో...దేవుడి మీద విశ్వాసం ఉంటుందో...అలాంటి వారిని నియమించాలని మీరు అంటున్నారు. ఇప్పుడున్న పాలకమండలిలో అలాంటివారు లేరని భావిస్తున్నారా?
ఎంపీ: నాకు తెలిసి భక్తి లేకపోతే సభ్యులుగా అనుమతించరు. కానీ ఒక భక్తే కాకుండా కొంత మంది అయినా సరే స్వామివారికి భూదానం చేసిన వారుండాలి. ఎందుకంటే వాళ్లకు స్వార్థం ఉండదు. అన్ని రాజకీయంగా కాకుండా 36 మంది సభ్యులున్నారు..వారిలో ఇద్దరు ముగ్గురికైనా దాతల కుటుంబాలకు సంబంధించిన వారుంటే మంచిది.
ఇదీ చదవండి: