రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు ఈసీ వెల్లడి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగటంతో ఆ మేరకు పోలింగ్ కేంద్రాలనూ పెంచుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల 920 పోలింగ్ కేంద్రాలున్నాయని... ఏప్రిల్ 11 న నిర్వహించే ఎన్నికల కోసం వీటిని 46 వేల 397కు పెంచుతున్నట్టు ద్వివేది స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో అదనంగా మరో 121 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని తెలిపారు. విజయనగరం జిల్లాలో ఒక్క పోలింగ్ కేంద్రం కూడా పెరగలేదని వివరించారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా... 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లుగా నమోదు అయి ఉన్నారన్నారు. జనవరి 11న విడుదల చేసిన జాబితాతో పోలిస్తే ఈ సంఖ్య 25 లక్షలు ఎక్కువని ఆయన వివరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను పెంచాల్సిన అవసరం వచ్చిందని వివరించారు. 25 లోక్ సభ స్థానాల్లో 344 మంది, 175 అసెంబ్లీ స్థానాల్లో 2395 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారని ద్వివేది వెల్లడించారు.
నియోజకవర్గాల వారీగా ఈవీఎంలపై ఉంచే బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తి అయ్యిందని స్పష్టం చేశారు. విజయవాడ, కర్నూలులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించిన ఈ బ్యాలట్ పత్రాలను ఆయా ప్రాంతాలకు పంపుతున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. మరోవైపు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక పోలీసు పరిశీలకులు కె.కె శర్మ సమీక్షించారని ద్వివేది తెలిపారు. ఎన్నికలకు ఎంత మంది భద్రతా సిబ్బంది అవసరం, ఇప్పటి వరకూ ఎన్ని కంపెనీలు వచ్చాయి... ఇంకా ఏమేరకు అవసరం అవుతారన్న అంశాలపై ఆరా తీశారని వివరించారు. అటు ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై హైకోర్టు న్యాయమూర్తులకు ప్రదర్శన ఇస్తున్నట్టు ఈసీ వెల్లడించింది.
ఇవి చదవండి
రాష్ట్ర ఎన్నికల అధికారులతో కె.కె. శర్మ భేటీ