వేసవి ప్రారంభంతో కృష్ణా జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇప్పటి వరకు కొంత ఆశాజనకంగానే ఉన్నా.. ఎండలు ముదిరే కొద్దీ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే కురవాల్సిన దాన్ని కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ ప్రభావం భూగర్భ నీటి మట్టంపై పడింది. జిల్లాలో సగటు నీటి మట్టం 11.14 మీటర్లకు పడిపోయింది. ఈ ప్రభావం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా పడింది. ఇక్కడ తాగునీటికి, సాగునీటికి బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. నూజివీడు ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో లోతుకు బోర్లు వేస్తున్నా నీరు అరకొరగానే వస్తోంది.
ఈ నెలలో తగ్గిన నీటిమట్టం
జిల్లాలో భూగర్భ నీటి మట్టం గత 2 నెలలతో పోలిస్తే పడిపోతోంది. ప్రస్తుతం ఇది 11 మీటర్లకు దిగజారింది. ఫిబ్రవరి నెల గణాంకాలతో పోలిస్తే.. ఈ నెలలో 0.49 మీటర్లు దిగువకు పడిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి 11.07 మీటర్లు ఉంది. గత నెల జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 967 మి.మీ కాగా.. ఇప్పటి వరకు 809.10 మి.మీ మాత్రమే పడింది. 16.30 శాతం తక్కువగా నమోదయ్యింది డెల్టా ప్రాంతంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కాలువలకు నీటిని నిరాటంకంగా విడుదల చేస్తుండడం వలన కొంత ఆశాజనకంగా ఉంది. ఇప్పటి వరకు 2 సీజన్లకు కలిపి మొత్తం 177 టీఎంసీలు మేర నీటిని విడుదల చేశారు.
పశ్చిమ ప్రాంతంలో అధికం
పశ్చిమ ప్రాంతంలో ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతం అంతా వర్షాధారమే. బోర్లను ఎక్కువ లోతున వేయాల్సి వస్తోంది. 3 మీటర్లలోపు నీరు దొరికే ప్రాంతాలు జిల్లాలో కేవలం 21.30 శాతమే. 34.30 శాతం ప్రాంతాల్లో నీరు కావాలంటే.. 3 నుంచి 8 మీటర్ల వరకు వెళ్లాల్సిందే. 44.40 శాతం చోట్ల 8 మీటర్లపైగా వేయాల్సిందే. రాష్ట్రంలోనే పాతాళానికి నీరు పడిపోయిన 100 ప్రాంతాల్లో జిల్లాలోని 4 ప్రాంతాలు కూడా ఉన్నాయి. ముసునూరు.. 112.16 మీ, సూరేపల్లి (ముసునూరు మండలం).. 73.47 మీ, పల్లెర్లమూడి (నూజివీడు).. 50.97 మీ, వేల్పుచర్ల (ముసునూరు) .. 36.08 మీటర్లకు నీరు అడుగంటింది.
ఇవీ చదవండి: