కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మున్నేరు కాలువపై ఉన్న భారీ వృక్షాలు ఏటికేడు కనుమరుగవుతున్నాయి. వాత్సవాయి మండలం పోలంపల్లి గ్రామం వద్ద మున్నేరు నదిపై 130 ఏళ్ల క్రితం బ్రిటీష్ కాలంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. పోలంపల్లి నుంచి సోమవరం వరకు 46 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ ఉంది. తొమ్మిది చిన్న కాలువలు ఉన్నాయి. ఈ కాలువ కట్టలపై అప్పట్లోనే మొక్కలు నాటారు. అవి భారీ వృక్షాలుగా ఎదిగాయి. ప్రాజెక్ట్ అధికారుల పర్యవేక్షణ లేక అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా వాటిని తొలగిస్తున్నారు.
ఇప్పటికే ఫలసాయం ఇచ్చే మామిడి, నేరేడు వంటి చెట్లు కనుమరుగయ్యాయి. తాజాగా పెనుగంచిప్రోలు బ్రాంచి కాలువపై భారీ వృక్షాలు తొలగించి వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మొదట వృక్షాల కొమ్మలు నరికేసి తర్వాత ఏకంగా మొత్తాన్ని తొలగిస్తున్నారు.
పచ్చదనం కాపాడాలని ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే మరోవైపు అధికారుల పర్యవేక్షణ లోపంతో భారీ వృక్షాలు కనుమరుగుకావడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎంతపెద్ద ‘ఎండు’గప్పలో..