లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే అటు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి విద్యుత్తు బిల్లులు షాక్ ఇచ్చాయి. పలువురికి భారీగా బిల్లులు వచ్చాయి. ఇల్లు గడవడానికే ఇబ్బంది పడుతున్న చాలా మందికి, ఇవి భారంగా మారాయి. రెండు నెలలకు కలిపి ఇప్పుడు జారీ చేయడం ఇబ్బందిగా మారింది. ఈ బిల్లులు ఎలా చెల్లించాలి..? అని మథనపడుతున్నారు. మార్చి 22 నుంచి అందరూ ఇళ్లకే పరిమితం అవడంతో విద్యుత్తు వినియోగం పెరిగింది. దీంతోపాటు ఏప్రిల్ నెల నుంచి కొత్త స్లాబ్ విధానం అమలులోకి రావడంతో బిల్లులను చూసి హతాశులవుతున్నారు.
జిల్లాలో మొత్తం గృహ కనెక్షన్లు 13.48 లక్షలు ఉన్నాయి. వీటిలో ఏ విభాగంలో 5.05 లక్షలు, బి విభాగంలో 6.80 లక్షలు, సి విభాగంలో 1.63 లక్షల చొప్పున కనెక్షన్లు ఉన్నాయి. ఏలో 75 యూనిట్లులోపు, బిలో 75 నుంచి 225 యూనిట్లలోపు, సీలో 225 యూనిట్ల కంటే ఎక్కువ వాడే వారిని చేర్చారు. కొత్త టారిఫ్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం గృహ వినియోగదారులపై విద్యుత్తు భారం పెద్దగా లేకపోయినా అధికంగా వినియోగించే వారికి వాత పడింది.
సాధారణంగా వేసవిలో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీ, ఫ్యాన్లను వినియోగించారు. దీని వల్ల ఎక్కువ మందికి 225 యూనిట్లు దాటాయి. వీరంతా సి విభాగంలోకి వచ్చారు. ఫలితంగా టారిఫ్ మారిపోయింది. 500 యూనిట్లు దాటిన వారికి యూనిట్‌కు రూ. 9.95 చొప్పున వేశారు. దీని కారణంగా బి, సి విభాగాల్లోని చాలా మందికి బిల్లులు భారీగా వచ్చాయి.
వినియోగాన్ని బట్టే బిల్లులు
అధిక బిల్లులపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. వినియోగదారులు వాడుకున్న దాన్ని బట్టే బిల్లులు వస్తున్నాయి. రెండు నెలల రీడింగ్‌లో సరాసరి తీసి వేస్తున్నాం. రెండు నెలలకు వేర్వేరు శ్లాబ్‌లో ఇస్తున్నాం. బిల్లులపై ఎలాంటి అనుమానాలు ఉన్నా.. టోల్‌ఫ్రీ నెంబరు 1912కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. లేనిపక్షంలో సంబంధిత సహాయ గణాంక అధికారి కార్యాలయాల్లో సంప్రదిస్తే, ఏ యూనిట్లకు ఎలా ఛార్జి వేసింది వివరించగలరు.- జయకుమార్, పర్యవేక్షక ఇంజినీర్, విజయవాడ