మున్సిపల్ ఎన్నికల నిమిత్తం... విజయవాడలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేనినాని, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అభ్యర్థులు తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. 43 వ డివిజన్‌లో మంత్రి వెల్లంపల్లి, 51వ డివిజన్‌లో మరో మంత్రి వేణుగోపాల్ ప్రచారంలో పాల్గొన్నారు. సంక్షేమ రాజ్యం రావాలంటే వైకాపా అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. 4వ డివిజన్‌లో ఎంపీ కేశినేని నాని ప్రచారంలో పాల్గొన్నారు. నిత్యవసరాల ధరలు పెరగడంతో పట్టణ ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. అసంఘటిత కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవడానికి వైకాపా ప్రభుత్వమే కారణమన్నారు. 39వ డివిజన్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర పథకాలతోనే పట్టణాల్లో మెరుగైన వసతులు కల్పించడం జరుగుతోందని ఆయన వివరించారు.
"తొలి సారి".. హోరాహోరీ
విజయనగరంలో తొలిసారి జరుగుతున్న నగరపాలక ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసానికి తెలుగుదేశం, వైకాపా ప్రత్యేక దృష్టి సారించాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలక నేతల కుమార్తెలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి, తెలుగుదేశం నేత అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరికి స్థానికుల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోంది. ప్రచారానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. పార్వతిపురంలో భాజపా అభ్యర్థుల తరపున సినీ నటి లావణ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి భాజపాకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు.
అనంతలో హోరెత్తిస్తున్నారు...
అనంతపురం జిల్లాలోనూ ప్రచారం హోరెత్తుతోంది. తాడిపత్రిలో ఇటీవల జరిగిన పరిణామాలతో తెలుగుదేశం, వైకాపా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలుగుదేశం అభ్యర్థుల తరపున జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. వైకాపా నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారులు ప్రచారంలో పాల్గొన్నారు.
బద్వేలులో...
కడప జిల్లా బద్వేలులో తెలుగుదేశం తరపున లింగారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 20 నెలల వైకాపా పాలనలో ప్రజలకు తాగునీరు కూడా దొరకడం లేదని విమర్శించారు. తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి:
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం