రాష్ట్ర టీకా నిల్వల కేంద్రం నుంచి మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి.. అక్కడి నుంచి కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్లు సరఫరా అవుతున్నాయి. నగరంలోని నారాయణపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెయ్యి డోసులను సిబ్బంది తీసుకువెళ్లారు. అక్కడకు వెళ్లిన తరవాత వైద్యులు పరిశీలించగా అందులో 40 డోసులు మాయమైనట్లు గుర్తించి చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అవి డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే తగ్గాయని ఏఎన్‌ఎంలు చెబుతున్నారు. ఎలా మాయమయ్యాయనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే మాదిరిగా వ్యాక్సినేషన్‌లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు జి.కొండూరు పీహెచ్‌సీ వైద్యులు రాజును వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్‌కు సరెండర్ చేసినట్లు శనివారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. రెండు రోజుల్లో వెలుగు చూసిన ఈ ఘటనలతో జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏఎన్‌ఎంలు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని మంత్రి పేర్ని నాని కార్యాలయానికి వెళ్లగా ఆయన అక్కడ లేకపోవడంతో చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులను కోరారు.
ఇవిగో సమస్యలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చిన వ్యాక్సిన్‌ను శీతలీకరణలో ఉంచి ప్రత్యేక వాహనాల్లో ఆసుపత్రులకు తరలించాలి. బందరు డివిజన్‌లోని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది ద్విచక్ర వాహనాలపై వచ్చి తీసుకెళ్తున్నారు. సమీప ప్రాంతమే కదా అని వైద్యాధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడమే వ్యాక్సిన్లు పక్కదోవ పట్టడానికి కారణమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇద్దరు ఉన్నతాధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకరు వ్యాక్సిన్ నిల్వలు చూసుకుంటుంటే.. మరొకరు సరఫరా తదితర బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఇద్దరికి బాధ్యతలు ఇవ్వడం కూడా సమస్యలకు ఓ కారణమని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. పూర్తిస్థాయిలో ఒకరికే బాధ్యతలుంటే వారే దానికి జవాబుదారీ అవుతారు. దానికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కరించలేకపోవడంతో మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియపైనే ఆ ప్రభావం పడుతోంది.
అందుబాటులో కేంద్రాలు లేక అవస్థలు
ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్న లక్ష్యంతో కేంద్రాలను కుదించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 72 కేంద్రాల్లో రెండో విడత వ్యాక్సినేషన్ జరుగుతోంది. పలు గ్రామాల్లో కేంద్రాలు దూరంగా ఉండటంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూడూరు మండలం రాయవరంలో 300 మంది వరకు రెండో విడత టీకా వేయించుకోవాలి. మొదటి విడత గ్రామంలోనే వేయగా.. రెండో డోసుకు గూడూరు వెళ్లాలని సిబ్బంది చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ కేసులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో దూరప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే టీకాలు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విచారణ జరుగుతోంది
మచిలీపట్నంలో టీకాలు మాయమైన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ జరుగుతోంది. దీనికి బాధ్యులు ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దూరప్రాంతాలకు వెళ్లి టీకాలు వేయించుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ మండల పీహెచ్‌సీ వైద్యులకు చెప్పి మార్పు చేయించుకునే వెసులుబాటు ఉంది. అలాంటి వారు వెంటనే సమస్యను వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. మేము కూడా ఆయా పీహెచ్‌సీ వైద్యులకు ఆదేశాలు జారీ చేస్తాం. - డా.శర్మిష్ఠ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి
ఇదీ చదవండి: శేషాచలం కొండల్లో గుప్త నిధుల వేట.. ఏడాది కాలంగా సొరంగం తవ్వకం