కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో కరోనా నిబంధనలను కట్టుదిట్టం చేశారు. గడిచిన నెల రోజులుగా దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్ర, ఆదివారాల్లో అమ్మవారి దర్శనానికి సగటున 15 వేల మంది భక్తులు వస్తున్నారు. కొవిడ్ లాక్డౌన్ తర్వాత సెప్టెంబర్ నెలలో దేవాలయాన్ని తెరిచారు. అప్పటి నుంచి భక్తుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. భక్తులు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయటం, ముఖానికి మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఆలయంలో అన్ని రకాల పూజలను రద్దు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు అక్కడి నుంచే అమ్మవారిని దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ నిబంధనలు కొనసాగుతున్నప్పటికీ.. కరోనా వైరస్ రెండో దశ వస్తుందనే ప్రచారంతో భక్తుల పట్ల నిబంధనలను మరింత కట్టుదిట్టం చేశారు.
ఆలయం బయట దేవస్థానం అధికారులు ,సిబ్బంది ఉండి భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. దీంతోపాటు క్యూలైన్లను ప్రతీ మూడు గంటలకు శుభ్రం చేస్తున్నారు. అలాగే వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని దేవస్థాన సిబ్బంది మైకులో ప్రచారం చేస్తున్నారు.