ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ మధ్య సోమవారం జరిగిన సమావేశం ఇరు రాష్ట్రాలు ప్రయోజనాలే లక్ష్యంగా సాగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. రాజకీయ అంశాలేవీ ఆ సమావేశంలో ప్రస్తావనకు రాలేదని తెలిపింది. 'కేంద్రం చిన్నచూపు' శీర్షికతో ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి 'ఈనాడు'లో వచ్చిన కథనంపై స్పందిస్తూ సీఎం కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప, మరే ఇతర విషయాలూ చర్చకు రాలేదని తెలిపింది. నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు రాజకీయ అంశాలు, సమీకరణలకు దూరంగా జరుగుతున్నాయని తెలిపింది.
సోమవారం నాటి సమావేశంలో గోదావరి జలాల తరలింపు ద్వారా సాగర్ కుడి కాల్వ కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు, తెలంగాణలోని పాత మెహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. 'ఆ ప్రాజెక్టులను సఫలం చేసే దిశగా ముఖ్యమంత్రులిద్దరూ చర్చించారు. ఆపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలూ చర్చకు వచ్చాయి. పోలీసు అధికారుల విభజన, తెలంగాణలో కొత్తగా నియమిస్తున్న పోలీసు కానిస్టేబుళ్లకు ఏపీలో శిక్షణనిచ్చే అంశంపైనా చర్చించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు సీఎంల దృష్టిపెట్టారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి :