రాష్ట్రంలో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా.. మానవ వనరుల్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీఐఐసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 ఇంజనీరింగ్ కళాశాలలను గుర్తించి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక రిజర్వేషన్లతో పాటు, పారిశ్రామిక ప్రగతి కోసం కార్యచరణ రూపొందించాల్సిందిగా అధికారులను కోరారు.
పెట్టుబడుల కోసం కొత్త నినాదం
పోర్టులు, ఎయిర్ పోర్టులు, మెట్రో రైలు, ఎలక్ట్రిక్ బస్సులు తదితర ప్రాజెక్టులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్... గ్లోబల్ టెండర్ల ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్రానికి కొత్త నినాదం తీసుకురావాలని సూచించారు. ఇజ్రాయిల్‌లో డీ-శాలినేషన్ ప్లాంట్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని.. 1 రూపాయికే 25 లీటర్ల తాగునీటిని అందిస్తున్నారని చెప్పారు. ఆ దిశగా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ముందు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు జగన్ సూచించారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలను తక్కువ మొత్తంలోనే శుద్ధి చేస్తున్నారని, అటువంటి చర్యలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలన్నారు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు 2 వేల కోట్ల రూపాయల మేర పెండింగులో ఉన్నాయన్న సీఎం... 2015-16 నుంచి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లు ఇవ్వలేదని స్పష్టంచేశారు.
పారదర్శక సేవలు
మున్సిపాలిటీలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అత్యుత్తమమైన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి పారదర్శకంగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి వైయస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మహిళలకు(45 ఏళ్లు దాటిన) నాలుగేళ్లలో... 75 వేల రూపాయలు ఇవ్వబోతున్నామన్నారు.
ఆర్టీసీ విలీనం
వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టనుందని, వీటికి చిన్న, మధ్య, సూక్ష్మస్థాయి పరిశ్రమలు వినియోగించుకునేలా చూడాలని సీఎం కోరారు. త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. జిల్లాల వారీగా పండే పంటల్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు మ్యాపింగ్ సిద్ధం చేయాలన్నారు. అదే సమయంలో... ఆక్వా ప్రాంతాలపై దృష్టి పెట్టి కల్తీ సీడ్, ఫీడ్ రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. కడప స్టీల్ ప్లాంట్‌పై కూడా సమీక్షలో చర్చించారు.
ఇదీ చదవండి:
రాంగ్ పార్కింగ్‌ను ప్రశ్నించినందుకు... సెల్‌ఫోన్ పగలగొట్టేసింది!