రైతులు ఆరుగాలం పండించిన పంటను వైకాపా పాలనలో దళారులకు అప్పజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని గొడవర్రు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలసి పర్యటించిన ఆయన.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి కొడాలి నాని దళారులతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా సక్రమంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ మౌనం... దళారీలకు వరంలా మారిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని లారీలో తేవాలని నిబంధన విధించడం సరికాదని ఉమా మహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పంట కోతలు కోసి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ రైతులు కల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ధాన్యం అమ్మకాలు జరిగి 20 రోజులు గడచినా రైతులకు ఇప్పటివరకు కొనుగోలు సొమ్ము చెల్లించలేదని దేవినేని మండిపడ్డారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి