Health for mankind with rice grains: సిరి ధాన్యాలతో మాత్రమే మానవజాతికి ఆరోగ్యం చేకూరుతుందని కృషిరత్న డా. ఖాదర్ వలీ పేర్కొన్నారు. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో నిర్వహించిన "సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం"పై అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కృష్ణాజిల్లా, అవనిగడ్డ గాంధీక్షేత్రం కమిటీ, రైతునేస్తం ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సుకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించారు.
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై సదస్సులు..: ముందుగా సదస్సును ప్రారంభించిన రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2005 సంవత్సరం నుండి రైతునేస్తం మాసపత్రిక ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2018 నుండి డా. ఖాదర్ వలీ సహాయంతో దేశంలో పలు ప్రాంతాలలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. దీనిని గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ ఏడాదిని "సిరిధాన్యాల సంవత్సరం"గా ప్రకటించిందని తెలిపారు.
50 ఏళ్లుగా ఆహార అలవాట్లలో మార్పు..: అనంతరం డా. ఖాదర్ వలీ మాట్లాడుతూ "ప్రస్తుతం ప్రజలు వరి ధాన్యం, ఫ్యాక్టరీ తినుబండారాలు, ఫాస్ట్ ఫుడ్ ఆహారపు అలవాట్లతో అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారని’’ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కాలంలో సిరిధాన్యాల అభివృద్ధి, ప్రచారాలు మరుగున పడ్డాయన్నారు. గడచిన 50 సంవత్సరాల నుండి గ్రామీణ, పట్టణ ప్రజలు ఫ్యాక్టరీ ఆహారాన్ని తిని ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోల్పోతున్నారని డా. ఖాదర్ వలీ విచారం వెలిబుచ్చారు.
పూర్వీకుల ఆరోగ్య రహస్యం ఇదీ..: ఫ్యాక్టరీ ఆహారాన్ని తీసుకోవడం వలన దీర్ఘకాలిక, మధుమేహ, హృద్రోగ, భయంకరమైన రోగాల సమస్యలకు కాలక్రమేణా గురువుతున్నారని పేర్కొన్నారు. వైజ్ఞానికంగా ప్రజలకు, పర్యావరణానికి హితంగా మన పూర్వీకులు తిన్నటువంటి 5 రకాలు సిరిధాన్యాలపై డా. ఖాదర్ వలీ అవగాహన కల్పించారు. కొర్రలు, అరికెలు, సాములు, అంటుకొర్రలు, ఊదలు వంటి సిరిధాన్యాల వలన పూర్వీకులు ఎటువంటి అనారోగ్యానికి గురి కాలేదని సెలవిచ్చారు.
జీవితకాలం పెరగాలంటే..: సిరిధాన్యాలను వినియోగించడం మూలంగా పూర్వీకుల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు జీవితకాలం కూడా ఎక్కువగా ఉండేదని డా. ఖాదర్ వలీ గతాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత జీవన విధానంలో వచ్చే వ్యాధులకు మనం తినే ఆహారమే ప్రధాన కారణమని తెలిపారు. ఫ్యాక్టరీ ఆహారాన్ని తీసుకోవడం వలన తలెత్తే అనారోగ్యకర పరిస్థితుల నుంచి బయటపడటానికి సిరి ధాన్యాల వినియోగమే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. 5 రకాల సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన దీర్ఘకాలిక రోగాలైన మధుమేహం, హృద్రోగ వ్యాధులు, థైరాయిడ్, బిపి, గ్యాస్ సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. తద్వారా ఆస్పత్రులలో వైద్యానికి అయ్యే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. సిరిధాన్యాలతో తయారైన ఆహార ఉత్పత్తులను తినడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించవచ్చని సలహా ఇచ్చారు.
డా.ఖాదర్ వలీ సూచనలు పాటిస్తే ఆరోగ్యం..: తదుపరి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా డా. ఖాదర్ వలీ సూచనలను అవలంబిస్తే ప్రజల జీవన ప్రమాణాలు, జీవిత కాలం పెరుగుతుందని పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, రైతునేస్తం ఫౌండషన్ అధ్యక్షులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, పద్మశ్రీ అవార్డుకు ఇటీవల ఎంపికైన డా. ఖాదర్ వలీలు దివి ప్రాంతానికి వచ్చి, దివిసీమ ప్రజలకు సిరిధాన్యాలతో ఆరోగ్యం అనే అంశంపై అవగాహన కల్పించడం ఎంతో ఆనందదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు సిరిధాన్యాల వినియోగం, ఫలితాలు, ఆరోగ్యం మెరుగుపరుచుకోవడంపై నిపుణుల సలహాలు, సూచనలను శ్రద్ధగా ఆలకించారు.
ఇవీ చదవండి