Chandrababu Chitchat with National Media in Delhi: ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అతిపెద్ద సమస్య జగనే.. జగన్ పోతేనే రాష్ట్రం బాగు పడుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడని ఆగ్రహించారు. దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. జాతీయ మీడియాతో మాట్లాడారు. కేవలం ప్రత్యేక హోదా (Special Status) అంశంపైనే కేంద్రంతో విభేదించాను తప్పా.. మిగతా ఏ విషయాల్లోనూ భేదాభిప్రాయాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ (Telugu Desam Party) ఎప్పుడూ జాతీయ భావంతో ఉండే పార్టీ అని, జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. 'రాజకీయాల్లో జగన్ అనుభవం ఎంత..? బచ్చా' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేం గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ విలీనమైపోతుందని, వైసీపీ కాస్తా.. టీడీపీగా మారుతుందని చంద్రబాబు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ జాతీయ మీడియాతో మాట్లాడారు. విభజన గాయాలకంటే.. జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) స్మారకార్థం వంద రూపాయల (100 Rupees Coin) వెండి నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది విడుదల చేయగా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనంతరం రాష్ట్రంలో ఓట్ల గల్లంతు, ఓటర్ జాబితాల్లో అక్రమాలపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో ఒంటరి పోరాటమే.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని తెలిపారు. భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడానికి సమయం మించిపోయిందన్నారు. ఎవరు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంపై కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. జాతీయ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుంది. తెలంగాణలో ఒంటరిగానే పోటీకి వెళ్తాం. బీడేపీతో కలిసి వెళ్లడానికి సమయం మించిపోయింది. ఎవరు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంపై కమిటీ ఏర్పాటు చేస్తాం. - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత