విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మృతి చెందారు. రెండు సార్లు పాలక వర్గానికి కార్పొరేటర్‌గా రవికుమార్ సేవలందించారు. ఈ సారి జీవీఎంసీ ఎన్నికల్లో 31వ వార్డులో కార్పొరేటర్‌గా గెలిచి, మొదటి కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరయ్యారు. సాయి పూజా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన... అనాధ శవాలకు అంతిమ సంస్కరాలు నిర్వహిస్తుండేవారు.
చంద్రబాబు సంతాపం..
జీవీఎంసీ 31వ వార్డు తెదేపా కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. మొదటి నుంచి రవికుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని, కార్పొరేటర్ గా స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని చంద్రబాబు గుర్తు చేశారు. కరోనా బారిన పడి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవికుమార్ మృతి దిగ్భ్రాంతికి గురిచెందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవికుమార్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నారా లోకేష్ ప్రగాఢ సంతాపం..
తెదేపా కార్పొరేటర్ వానపల్లి రవికుమార్, చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత భర్త కఠారి ప్రవీణ్‌ల మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. రవికుమార్ మృతి పార్టీకీ, డివిజన్ ప్రజలకు తీరని లోటన్నారు. రవికుమార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలు గెలుచుకున్న రవికుమార్.. మృత్యువుతో పోరాడి ఓడిపోవటం బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ అకాల మరణంతో తీవ్ర విషాదంలో వున్న కుటుంబానికి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇవీ చూడండి...