దేవినేని ఉమ కుటుంబసభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించినందుకే కక్షతో అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. దేవినేని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉమ రాత్రింబవళ్లు పనిచేశారని.., జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీయటంతో.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. వాహనం ధ్వంసంతోపాటు... పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ.. వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. దాదాపు ఆరుగంటలపాటు కారులోనే నిరసన తెలిపిన ఉమాను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కారు అద్దం ధ్వంసం చేసి.. లోపలి నుంచి తలుపు తీసి.. ఉమాను బయటకులాగారు.
సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల కనుసన్నల్లోనే.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దాడి చేయించారని దేవినేని ఉమా ఆరోపించారు. తన వ్యాఖ్యలను బలపరుస్తూ.. ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడిన వీడియోను నేతలు విడుదల చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణతో దేవినేని ఉమాను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దేవినేని ఉమా కారులోనుంచి దిగకుండా ఇబ్బంది పెట్టేలా ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు తలెత్తేలా వ్యవహరించారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వర్గాలను రెచ్చగొట్టేలా దేవినేని ఉమా వ్యవహరించడంతో ఆయన పై కేసులు నమోదు చేశామన్నారు.
ఇదీ చదవండి: