రాష్ట్రంలోని హోంశాఖ పరిధిలోని కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల ప్రతిభావంతుల జాబితా కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్, జైళ్ల శాఖలో వార్డెన్ పోస్టుల భర్తీ కోసం తుది పరీక్షను నిర్వహించారు. వీటి ఫలితాలు విడుదలై 22 రోజు గడుస్తున్నా... నేటికీ ప్రతిభావంతుల జాబితా విడుదల కాకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆయా విభాగాల్లో 2 వేల 723 పోస్టుల భర్తీకి నిర్వహించగా.. తుది రాతపరీక్షకు 64 వేల 575 మంది హాజరుకాగా...58 వేల ఏడుగురు అర్హత సాధించారు. వీరిలో 53 వేల 504 మంది పురుషులు, 4 వేల 498 మంది మహిళలు ఉన్నారు. సగటున ఒక్కో పోస్టుకు 21 మంది వరకూ పోటీపడుతున్నారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించిన వారు, వారికి వర్తించే రిజర్వేషన్ , ఆ విభాగానికి కేటాయించిన పోస్టులు తదితర అంశాల ఆధారంగా ప్రతిభావంతుల జాబితా రూపొందిస్తారు. అందులో తొలి 2వేల 723 స్థానాల్లో ఉన్నవారు ఉద్యోగానికి ఎంపికవుతారు. నోటిఫికేషన్ విడుదలై 10 నెలలు అవుతోందని...ప్రతిభావంతుల జాబితాను వెంటనే విడుదల చెయ్యాలని అభ్యర్థులు కోరుతున్నారు.