Asani cyclone Effected on Crops: వరుస విపత్తులకు కృష్ణా జిల్లా రైతులు చిత్తవుతున్నారు. మూడేళ్లలో 7 ప్రకృతి విపత్తులు పంటలను పూర్తిగా తుడిచిపెట్టేశాయి. నష్టం జరిగిన ప్రతిసారీ అధికారులు రావడం.. లెక్కలు రాసుకునిపోవడం తప్ప ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదని రైతులు వాపోతున్నారు. అసని తుపాన్ ప్రభావం ఊహించిన దానికన్నా తక్కువే ఉన్నా.. కృష్ణా జిల్లాలో మాత్రం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా లంక గ్రామాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలపై భారీగా ప్రభావం చూపింది. అరటి, బొప్పాయి, మునగ, మామిడి తోటలు..ఈదురుగాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి.
తోట్లవల్లూరు మండలంలో 600 హెక్టార్లలో అరటి పంట దెబ్బతినగా.. ఉద్యాన శాఖ అధికారులు నామమాత్రంగానే అంచనాలు వేశారని రైతులు ఆవేదన చెందుతున్నారు. బొప్పాయి తోటలకూ తీవ్రం నష్టం వాటిల్లగా.. 33శాతం పైబడి నష్టం జరిగితేనే పరిగణలోకి తీసుకుంటామని అధికారులు చెప్తున్నారని రైతులు వాపోయారు. లంక గ్రామాల్లో తమలపాకు, మునగ వంటి పంటలకు కూడా నష్టం వాటిల్లింది.
కృష్ణా జిల్లాలోని 24 తీరప్రాంత గ్రామాల్లో అసని తుపాను.. రైతుల్ని దెబ్బతీసింది. 1136 మంది రైతులకు సంబంధించిన 790 హెక్టార్లలోని వ్యవసాయ పంటలు దెబ్బతినిన్నాయి. వీరిలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తుపాను దెబ్బకు పాడైపోయిన పంటను తీసి మళ్లీ వేయాలన్నా డబ్బులు లేవని వాపోయారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేశ్ కుమార్ మీనా నిమామకం