Arekapudi Sisters Skill : ఆడుకునే వయస్సులో పిల్లలు బండి నేర్చుకుని రోడ్డెక్కుతాం అంటే తల్లిదండ్రులు ఎంతో కంగారు పడతారు. తెలిసీ తెలియని వయస్సులో డ్రైవింగ్ సరిగా చేస్తారా లేదా అనే ఆందోళన కన్నవారిలో సహజంగా ఉంటుంది. అలాంటిది.. 16ఏళ్ల ఇషిత ఏకంగా ఓ విమానం తీసుకుని ఆకాశంలో దూసుకుపోతోంది. ఇందుకు అవసరమైన లైసెన్స్‌ను అతి చిన్న వయస్సులోనే సాధించిన ఘనత సొంతం చేసుకుంది. నాసాలో ఆస్ట్రోనాట్‌గా మార్స్ వైపు ప్రయాణించాలనే తన కల సాకారం కోసం కృషి చేస్తోంది.
16 ఏళ్లకే విమానం నడిపి.. కృష్ణా జిల్లాకు చెందిన ఇషిత తల్లితండ్రులు మంజుల, భరత్ కుమార్ వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచి ఇషిత అస్ట్రోనాట్స్ వైపై ఆసక్తి పెంచుకుంది. స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి చేసిన నాసా విజ్ఞాన యాత్ర ఆమె కలల సాకారానికి బీజం వేసింది. అంతరిక్ష యాత్రికులతో ముఖాముఖిలో పాల్గొని తాను మార్స్ వైపు ప్రయాణించాలని అప్పుడే నిర్ణయించుకుంది. అంతరిక్షం (the space) లో అన్నేసి గంటలు ప్రయాణించాలంటే తొలుత పైలెట్ కావాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ కఠోర శిక్షణ తీసుకుంది. విజయానికి తొలిమెట్టులో భాగంగా చిన్న వయస్సులోనే విమానం నడిపి అందరినీ ఔరా అనిపించింది.
సంచలనం సృష్టించిన అప్ లిప్ట్ టీన్స్ టుడే బుక్.. ఇషిత చెల్లెలు 13ఏళ్ల అరెకపూడి తాన్వి ప్రతిభ అపారం. తన తోటి పిల్లల్లో దాగి ఉన్న ఒత్తిళ్లు, ఆందోళనలపై అధ్యయనం చేసి, వాటికి పరిష్కారాలు చూపుతో ఓ పుస్తకమే రాసింది. చాలా ఒత్తిళ్లకు కారణం తమలో దాగి ఉన్న బాధను ఇతరులతో పంచుకోకపోవటమే ప్రధాన కారణంగా విశ్లేషించింది. కుటుంబం ఐర్లాండ్ నుంచి అమెరికాకు మారినప్పుడు కొత్త పరిచయాలు, కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు వంటి సంఘటనల కారణంగా తాను పడిన మానసిక ఇబ్బందులు మరెవ్వరకీ కలగకూడదనే ఉదేశంతో పెద్దరికంగా ఆలోచించి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తాన్వి. అప్ లిఫ్ట్ టీన్స్ టుడే పేరుతో తాన్వి రాసిన పుస్తకం అమెరికాలో సంచలనమే సృష్టించింది. వివిధ పాఠశాలలకు ఈ చిన్నారి సూచనలు ఆదర్శంగా నిలిచాయి. దీంతో చిన్న పిల్లల మానసిక ఒత్తిళ్లు పరిష్కరించేలా 3సంస్థలు తాన్వీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. చదువుకుంటూనే ఆదాయమూ ఆర్జిస్తున్న తాన్వీ యూత్ అంబాసిడర్ (Youth Ambassador)గా పేరు సొంతం చేసుకుంది.
One Crore Schorship: ఔషధాలపై అధ్యయనం.. ఆ యువతికి అమెరికా వర్సిటీ రూ.కోటి స్కాలర్షిప్ ఆఫర్
తమ పిల్లల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు తల్లిదండ్రులు తమ వంతు ప్రోత్సాహం ఇస్తున్నారు. విదేశాల్లో అపార ప్రతిభ కనబరుస్తున్న తమ మనవరాళ్లను చూసి విజయవాడ పోరంకిలో ఉండే తాతయ్య, నానమ్మ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి, కుటుంబానికి పేరు తెచ్చేలా తమ మనవరాళ్లు చేస్తున్న కృషి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు మాతృదేశం విలువలు, సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే అగ్రదేశంలో తమ సత్తా చాటుతున్న ఈ చిన్నారుల భవిష్యత్తు బంగారం కావాలని మనమూ ఆశిద్దాం.