కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు తొలి రోజే నీరాజనం పలికారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఏ రోజుకారోజు వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారులు సైతం జయహో కర్ఫ్యూ అన్నారు. ప్రజలు రోడ్డెక్కకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలోని వీధులు జనం లేక బోసిపోయాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి రహదారులు వెలవెలబోయాయి. అత్యవసర పనుల మీద తిరిగే అతి కొద్ది మంది తప్ప అన్ని ప్రాంతాల్లోనూ కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.
విజయవాడ నగరంలో ప్రధానమైన వ్యాపార కూడళ్లు జనం లేక బోసిపోయాయి. వన్‌టౌన్ వస్త్రలత, కాళేశ్వరరావు మార్కెట్, సామారంగం చౌక్, స్టీల్ సెంటర్, గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్, రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ కూరగాయలు, పూల మార్కెట్లు సైతం మూతపడ్డాయి. ఇక పాత పోలీస్ కంట్రోల్‌రూం కూడలిలోని పై వంతెన, బెంజిసర్కిల్ పైవంతెన, కనకదుర్గ పై వంతెనలపై రాకపోకలను నియంత్రించారు. మహాత్మాగాంధీ రోడ్డులో కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డు మూసివేశారు. ఇక ఆసుపత్రులు, మందుల దుకాణాలకు పేరొందిన సూర్యారావుపేట నక్కలరోడ్డు, డోర్నకల్‌రోడ్లు సైతం జన సంచారం లేక బోసిపోయాయి. చాలా మందుల దుకాణాలను వ్యాపారులు మూసివేశారు.
నియంత్రణ పాటిస్తే మనదే విజయం
తొలి రోజు జన సంచారం లేకపోవటంతో పోలీసులకు పనిలేకుండా పోయింది. అరకొరగా వస్తున్న వాహనాలను ఆపి వారి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో ఇంతటి క్రమశిక్షణ చూడటం ఇదే మొదటి సారని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కర్ఫ్యూ లేని సమయంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇదే క్రమశిక్షణ పాటిస్తే.. త్వరగా కరోనాను కట్టడి చేయవచ్చని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్
కొవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తోందని, అత్యవసరమైతేనే జనం బయటకు రావాలని కలెక్టర్ ఎ.ఎం.డి.ఇంతియాజ్ పేర్కొన్నారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చే వారు తగిన ఆధారాలు చూపించాలని సూచించారు. తొలి రోజు కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరును బుధవారం ఆయన నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులుతో కలిసి పరిశీలించారు. బీసెంట్‌రోడ్డు, మహాత్మాగాంధీరోడ్డుల్లో ఆకస్మికంగా పర్యటించారు. పాత పోలీస్ కంట్రోల్‌రూం కూడలిలో పోలీస్ కమిషనర్‌తో కర్ఫ్యూ అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి రోజు ప్రజల నుంచి చక్కని స్పందన వచ్చిందన్నారు. రాబోయే రెండు రోజుల్లో ప్రజలను మరింతగా అప్రమత్తం చేస్తూ అవగాహన పెంచాలని పేర్కొన్నారు. మీడియా, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర సిబ్బందిని డ్యూటీ సమయాల్లో అనుమతించాలని సూచించారు. సీపీ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. తొలి రోజు ప్రజల సహకారం బాగుందన్నారు. కర్ఫ్యూ అమలు చేసేందుకు పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: 'కరోనాకు చికిత్స : లాయర్లకు నగదు రహిత వైద్యానికి ' రక్ష ' ఒకే'