Upadi Hami Pathakam Workers Problems: గ్రీష్మ తాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పచ్చని కోనసీమలోనూ ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో వేసవికాలంలో ఉపాధి పనులు చేసేందుకు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఉపాధి కూలీలకు ప్రత్యేకించి వేసవిలో కొన్ని అలవెన్సులు ఇచ్చేవారు. ప్రస్తుతం వాటిని తొలగించడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధి కూలీలకు వేసవిలో ప్రత్యేకించి మజ్జిగ, మంచినీళ్లు వంటి సదుపాయాలు ఉండేవి. ఒక్కో కూలీకి మజ్జిగ నిమిత్తం ఎనిమిది రూపాయలు, ఐదు లీటర్ల మంచినీళ్ల కోసం రెండు రూపాయలు ఇచ్చేవారు. అంతేకాకుండా నిర్దేశించిన పనిలో 80 శాతం పనిచేస్తే నూరు శాతం పని కింద లెక్క చేసేవారు. అంటే 20 శాతం పని రాయితీ ఇచ్చేవారు. అయితే మూడేళ్ల నుంచి ఈ సదుపాయాలన్నీ తొలగించారు.
పనులు చేసే చోట మజ్జిగ, మంచినీళ్లు, ప్రథమ చికిత్స పెట్టెలు, టెంట్లు వంటి సదుపాయాలు అమలు చేసేవారు. మూడేళ్ల నుంచి వీటిని తొలగించటంతో వేసవి సీజన్లో ఉపాధి కూలీలు దాహార్తితో అల్లాడిపోతున్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మజ్జిగ ఇస్తుంటే దానిని తాగుతున్నామని కూలీలు చెబుతున్నారు.
ప్రభుత్వరంగం నుంచి వచ్చే అలవెన్స్లను తొలగించడం వల్ల వల్ల ఉపాధి కూలీలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. దీంతో తమకు రావలసిన అలవెన్సులను అమలు చేయాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జిల్లాలో ప్రస్తుతం రోజుకు సుమారు 40 వేల మంది ఉపాధి కూలీలు వివిధ ఉపాధి పనుల్లో పనిచేస్తున్నారు. వీరికి అలవెన్సులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. అలవెన్స్ తొలగించడంతో తాము పడుతున్న ఇబ్బందులను ఉపాధి కూలీలు ఏకరువుపెట్టారు.
"గతంలో మాకు ప్రథమ చికిత్స బాక్సులు ఇచ్చేవారు. వేసవి ఎండల వేడి నుంచి నీడ కోసం టెంట్లు వేసేవారు. అయితే ఇప్పుడు అలా చేయట్లేదు. దీంతోపాటు ఎండ తాపానికి మజ్జిగ కూడా మాకు ఇచ్చేవారు. ఇప్పుడు అదీ కూడా లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి మజ్జిగ ఇస్తుంటే దానిని తాగుతున్నాము. ఇదివరకు ఒక్కపూటే పని ఉండేది. ఇప్పుడు అలా కూకుండా రెండు పూటలా పనులు చేయిస్తున్నారు." - ఉపాధి హామీ పనుల కూలీలు
ఇవీ చదవండి: