Arrests in Amalapuram incident: అమలాపురం అల్లర్ల ఘటనలో మరో 20 మందిని అరెస్టు చేసినట్లు డీఐజీ పాలరాజు స్పష్టం చేశారు. అల్లర్ల ఘటనలో ఇప్పటివరకు 91 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అమలాపురంలో 144 సెక్షన్, పోలీసు చట్టం 30 అమల్లో ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో జాతీయ నాయకులను కించపరిచేలా పోస్టులు పెట్టవద్దని..పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని డీఐజీ హెచ్చరించారు.
నిందితుల కోసంవేట: గత నెల 24న జరిగిన విధ్వంసంలో మంత్రి పినిపే విశ్వరూప్ నివాసాలు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసం, మూడు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. అమలాపురంలోని శుభకలశం మొదలుకొని గడియార స్తంభం నల్ల వంతెన, కలెక్టరేట్ ఎర్ర వంతెన, మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాస దగ్ధం వరకు పాల్గొన్న ఆందోళనకారులపై పోలీసులు.. సాంకేతిక సహకారంతో దర్యాప్తు చేస్తూ నిందితులను అరెస్టు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 7 బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
అందుబాటులోకి రాని ఇంటర్నెట్ సేవలు: పస్తుతం అమలాపురం పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పోలీసులు.. తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. పట్టణంలోకి వస్తున్న వారికి అన్ని రకాల ప్రశ్నలు అడిగి.. సంతృప్తి చెందితే అమలాపురంలోకి అనుమతిస్తున్నారు. అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లాలో నిలిచిన ఇంటర్నెట్ సేవలను 9 రోజుల తర్వాత అమలాపురం మినహా ఇతర ప్రాంతాల్లో క్రమక్రమంగా పునురుద్ధరిస్తున్నారు.
ఇవీ చూడండి