Nara Lokesh Yuvagalam Padayatra Restarted: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను పునప్రారంభించారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి పాదయాత్ర పునః ప్రారంభమైంది. లోకేశ్‌కు మద్దతుగా పెద్దఎత్తున తెలుగుదేశం నేతలు క్యాంపు సైట్ వద్దకు వచ్చారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా అన్ని నియోజకవర్గాల ఇంచార్జ్‌లు పాదయాత్రకు మద్దతు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అంతేకాకుండా జనసైనికులు భారీగా తరలివచ్చి పాదయాత్రకు తమ మద్దతు ప్రకటించారు.
పెద్దఎత్తున యువగళానికి ఏర్పాట్లు: జనసేన నాయకులు లోకేశ్ పాదయాత్రకు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లను పూర్తి చేశారు. యువగళం పాదయాత్రలో పాల్గొననున్న లోకేశ్ తాటిపాక సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. పి. గన్నవరం నియోజకవర్గంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం మామిడికుదురులోని స్థానికులతో సమావేశం కానున్నారు.
పేరూరు శివారు విడిది కేంద్రంలో బస: మామిడికుదురు నుంచి పాశర్లపూడి, అప్పనపల్లి మీదుగా అమలాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖిలో లోకేశ్ పాల్గొననున్నారు. పేరూరులో రజక సామాజిక వర్గీయులతో భేటీ కానున్నారు. ఈ రోజు పాదయాత్ర ముగించుకుని రాత్రికి పేరూరు శివారు విడిది కేంద్రంలో బస చేయనున్నారు.
వైసీపీ తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయి: నారా లోకేశ్
నేటి యాత్రతో 210వ రోజు: పునఃప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర మొదటి రోజు దాదాపు 16 కిలోమీటర్ల మేర సాగనుంది. మొదటప్రారంభమైన యాత్రలో ఇప్పటి వరకు 209 రోజులపాటు కొనసాగగా.. 2వేల 852 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర పునః ప్రారంభమైన నేడు 210వరోజు కాగా.. నేడు రాజోలు, పి. గన్నవరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనుంది.
యుగగళం పాదయాత్రకు భారీగా మద్దతు : లోకేశ్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్రకు టీడీపీ - జనసేన నేతలు భారీ ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండల టీడీపీ - జనసేన నాయకులు యువగళం పాదయాత్రలో పాల్గొనెందుకు భారీగా తరలివెళ్లారు. స్థానిక వెంకటరాజు ఆయిల్ మిల్ ఆవరణ నుంచి ఇరుపార్టీల నేతలు ఒక్కటే బైక్ ర్యాలీ నిర్వహించి.. అక్కడి నుంచి బయల్దేరారు. పాదయాత్ర ద్వారా సమరానికి సిద్ధం కావాలని.. అరాచక పాలన అంతానికి శ్రీకారం చుట్టాలని వారు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలి వెళ్లారు.
ఫిషింగ్ హార్బర్ ప్రమాదం దురదృష్టకరం - బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఎలూరు జిల్లా నుంచి తరలిన టీడీపీ - జనసేన శ్రేణులు: పొదలాడలో పునః ప్రారంభం కానున్న యువగళం పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు.. దెందులూరు నియోజవర్గం నుంచి టీడీపీ - జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. నియోజకవర్గంలోని దెందులూరు ,పెదవేగి ,పెదపాడు, ఏలూరు గ్రామీణ మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు బయల్దేరి వెళ్లారు. మొదట నియోజకవర్గంలో కార్ల ర్యాలీ నిర్వహించి.. అక్కడి నుంచి పాదయాత్రకు బయల్దేరి వెళ్లారు.
జగన్ ప్రభుత్వానికి ప్రజల చరమ గీతం: సీఎం జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతున్నారని.. అనడానికి యువగళం పునఃప్రారంభానికి వచ్చిన ప్రజాస్పందనే నిదర్శనమని టీడీపీ - జనసేన నేతలు స్పష్టం చేశారు. జగన్‌ను ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారో చేప్పేందుకు.. ప్రజలు లక్షల కారణాలను చూపుతున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం - జనసేన విజయం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు.