Konaseema District Prabhalu Teertham: కోనసీమలో ఏటా కనుమ పర్వదినాన నిర్వహించే ప్రభల తీర్థాలు వైభవంగా సాగాయి. ఏకాదశ రుద్రులు కొలువుదీరే అంబాజీపేట మండలం జగ్గన్నతోట జనసంద్రంగా మారింది. లక్షల సంఖ్యలో భక్త జనం తరలివచ్చి సంప్రదాయ, ఆధ్యాత్మిక శోభను వీక్షించి అమితానందం పొందారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. రంగురంగుల నూలుతో నయనానందంగా తీర్చిదిద్దిన ప్రభలను జగ్గన్నతోటకు భక్తులు భుజాలపై మోసుకొచ్చారు. ప్రభలకు శిఖర భాగంలో త్రిశూలం, మధ్యభాగంలో మకరతోరణంతో ఉన్న మహారుద్రుడి ఉత్సవ ప్రతిమను కొలువుతీర్చారు.
కోనసీమలో ప్రభల ఊరేగింపు - ప్రత్యేక ఆకర్షణగా జనసేన ప్రభ
అద్భుతంగా ప్రభలను నదీ దాటించిన సన్నివేశం: గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు గ్రామాలకు చెందిన పార్వతీ వీరేశ్వరస్వామి, చెన్నమల్లేశ్వరస్వామి ప్రభలను ఎగువ కౌశికనదిని దాటించి తీసుకొచ్చారు. ప్రవాహంతో ఉన్న ఎగువ కౌశిక నదిలో దిగినప్పుడు ప్రభలను భుజాలపై ఎక్కడా ఒరగకుండా జాగ్రత్త వహిస్తూ, 150 మంది యువకులు తీరం దాటించే సన్నివేశం మహద్భుతంగా ఆవిష్కృతమైంది.
" ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతాయి. ప్రభలు కాలువలో నుంచి తీసుకెళ్లడం ప్రధానంగా ప్రసిద్ధి. అందుకే ప్రభల తీర్థాలను చూడాటానికి వచ్చాము. చాలా బాగుంది." - భక్తురాలు
ఈ సంవత్సరం చాలా మంది ప్రభల తీర్థానికి వచ్చారు. విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది." -భక్తుడు
ఊరూవాడా జోరుగా సంక్రాంతి సంబరాలు- భోగి మంటలు జీవితాల్లో వెలుగులు నింపాలంటూ ఆకాంక్ష
ఆధ్యాత్మిక వాతావరణంలో జగ్గన్నతోట తీర్థానికి: వ్యాఘేశ్వరం వ్యాఘేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యామ్రేశ్వరస్వామి రూపాలతో ప్రభలను మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల జయజయ ధ్వానాలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో జగ్గన్నతోట తీర్థానికి తీసుకువచ్చారు.
సుమారు 80 గ్రామాల్లో ఘనంగా ఉత్సవాలు: కోనసీమ జిల్లావ్యాప్తంగా అంబాజీపేట, అయినవిల్లి, కొత్తపేట, పి. గన్నవరం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం, ముమ్మిడివరం మండలాల్లోని 80 గ్రామాల్లో సంక్రాంతి ప్రభల ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించారు.
అంబరాన్నంటిన సంక్రాంతి సంబారాలు - నృత్యాలతో సందడి చేసిన మహిళలు