Konaseema Coconut Market in Crisis: పెట్టుబడులు కూడా రావడం లేదంటూ కోనసీమ కొబ్బరి రైతులు దిగాలు పడుతున్నారు. రాష్ట్రంలోనే పేరుగాంచిన కోనసీమ కొబ్బరి మార్కెట్ సంక్షోభంలో కూరుకుపోవడమే ఇందుకు కారణం. కొబ్బరికాయల దిగుబడులు బాగుంటే ధర ఉండటం లేదు.. ధర బాగున్నప్పుడు దిగుబడులు ఆశాజనకంగా లేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేలాది మందికి ఉపాధి: వీటన్నింటికి తోడు.. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ అధికం కావడంతో.. కొబ్బరి మార్కెట్లో వ్యాపారుల లావాదేవీలు గత ఆరు మాసాలుగా అంతంత మాత్రమే సాగుతున్నాయి. కోనసీమ జిల్లాలో 1.26 లక్షల ఎకరాల్లో కొబ్బరి పంట సాగు అవుతుంది. ఈ పంట ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది రైతులు, కార్మికులు, వ్యాపారులకు ఉపాధి కల్పిస్తోంది.
కోనసీమ జిల్లాలో కంటే ఇతర రాష్ట్రాల కొబ్బరికాయల పరిమాణం నాణ్యత బాగుంటున్నాయి. అదే విధంగా పొరుగు రాష్ట్రాల కొబ్బరికాయలు తక్కువ ధరకే వస్తున్నాయి. గతంలో వెయ్యి కొబ్బరికాయల ధర 11 వేల రూపాయలు ఉండగా.. ప్రస్తుతం 7500 రూపాయలుగా ఉంది. దీంతో అక్కడ ధర తగ్గడంతో పాటు దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎకరానికి 2000 నుంచి 2500 కాయలు దిగుబడి వస్తుంది. ఫలితంగా వర్తకులు అక్కడే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలోని కొబ్బరికాయలను కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆర్డర్లు రావడం లేదు. స్థానికంగా కూడా పెద్దగా డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో జిల్లా నుంచి కొబ్బరికాయలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు జోరుగా ఎగుమతులు జరిగేవి.
ఆయా రాష్ట్రాల వర్తకులు ఇప్పుడు తమిళనాడు కొబ్బరికాయలకే ఆర్డర్ ఇస్తున్నారని జిల్లాలోని కొబ్బరి రైతులు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుడు శ్రావణమాసంలో 1000 కొబ్బరికాయల ధర.. 8500 నుంచి 9000 వేల రూపాయలు పలికాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో 1000 కొబ్బరికాయల ధర 7000 నుంచి 7500 రూపాయలు మాత్రమే పలుకుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
కొబ్బరి సాగు కష్టతరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులకు వస్తున్న రాబడికి ఏమాత్రం సంబంధం లేకుండా పోతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొబ్బరి మార్కెట్లో అనుకూల పరిస్థితులు రావాలంటే కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు.
"కొబ్బరి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ధర పూర్తిగా పడిపోయింది. అస్సలు కొబ్బరి దిగుబడికి.. ధరకి సంబంధం లేదు. కొబ్బరి కాయలను దించడానికి, ఇతర ఖర్చులు అధికంగా అవుతున్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది". - ఆకుల సూరిబాబు, రైతు
Salt Farmers Problems: అకాల వర్షం.. ఉప్పు రైతులకు తీరని నష్టం..