Fisherman Saved His Life With Swimming: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్య్సకారుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. తోటి మత్య్సకారులకు అతని ఆచూకీ లభించలేదు. తీవ్ర నిరాశతో వెనుదిరిగిన వారికి.. 11గంటల సమయం గడిచిన తర్వాత గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించింది. ఆ సమాచారం వారిలో ఒక్కసారిగా సంతోషాన్ని నింపింది. సముద్రంలో గల్లంతైన వ్యక్తి అనూహ్యంగా 11 గంటలు సముద్రంలో ఈత కొడుతూనే ఉండగా.. చేపల వేటకు వెళ్లిన మరో మత్య్సకారుల బృందం అతడ్ని గమనించి సురక్షితంగా ఒడ్డుకు తరలించారు.
కాకినాడకు చెందిన మత్స్యకారుడు గేదెల అప్పారావు అనే మత్య్సకారుడు సముద్రంలోకి చేపల వేటకై బోటు సహాయంతో వెళ్లాడు. అతనితో పాటు మరో ఐదుగురు కూడా అదే బోటులో వేటకు వెళ్లారు. చేపలు వేటాడుతున్న క్రమంలో బోటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్దకు చేరుకోగానే.. మంగళవారం రోజున అప్పరావు బోటులోంచి జారి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. ఈ విషయాన్ని రాత్రి ఒంటిగంటకు తోటి మత్య్సకారులు గమనించారు.
"మేము కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లాము. సముద్రంలో రాత్రి 12గంటల సమయంలో వల వేశాము. తర్వాత వల తీద్దామని ముందే అనుకున్నాము. కానీ, రాత్రి ఒంటిగంట సమయంలో లేచి చూసేసరికి అప్పారావు కనిపించలేదు. ఏంటీ ఇలా జరిగిపోయిదేంటి అని అందరమూ కంగారుపడ్డాము. అతని కోసం సముద్రంలో వెతకసాగాము. ఎంతకు అతని ఆచూకీ లభించకపోవటంతో తిరిగి ఒడ్డుకు చేరుకున్నాము." -పట్టా అప్పలరాజు, మత్స్యకారుడు
అతడు బోటులో లేకపోవడాన్ని గమనించిన మత్య్సకారులు.. సముద్రంలో వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా అప్పారావు ఆచూకీ లభించకపోవటంతో వారు నిరాశతో ఒడ్డుకు చేరుకున్నారు. మరోవైపు సముద్రంలో జారి పడిపోయిన అప్పారావు.. ప్రాణాలు దక్కించుకోవటానికి సముద్రంలో ఈదటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో విశాఖ జిల్లా నక్కపల్లి రాజీవ్పేటకు చెందిన మత్స్యకారులు తెప్పలపై సముద్రంలోకి వేటకు వెళ్లారు.
వారు వేటాడుకుంటూ.. సముద్రంలోకి దాదాపు 15కిలోమీటర్ల వరకు చేరుకోగానే.. వారికి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అప్పారావు ఈదుతూ కనిపించాడు. దీంతో వారు అప్పారావును కాపాడి సురక్షితంగా నరసాపురం వద్ద సముద్రం ఒడ్డుకు చేర్చారు.. అతడ్ని అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌కు చేర్చారు. వైద్య నిమిత్తం అక్కడి నుంచి రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పారావును పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
సముద్రంలో గల్లంతైన అప్పారావు 11 గంటలు గడిచిన తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవటంతో.. అతనితో పాటు చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యం కోసం అంతర్వేది నుంచి రాజోలు వరకు సూమారు 30కిలోమీటర్ల దూరం తీసుకురావాల్సి వచ్చిందని మత్య్సకారులు అసహనం వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్‌లోనే వైద్య సదుపాయం కల్పిస్తే.. ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే.. సహాయపడుతుందని అన్నారు. దీనివల్ల తమకు ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు.