Konaseema Lanka villages in flood: గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. రాజమహేంద్రవరానికి శనివారం కూడా భారీ వరద తరలి వచ్చింది. ఈ ఉగ్ర ప్రవాహాలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రమాల్ని వరద నీరు మరింతగా చుట్టుముట్టేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి శనివారం రోజంతా వరద పెరుగుతూనే ఉంది. దీంతో కోనసీమలోని 30 గ్రామాలకు పైగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లంకవాసులు మర, నాటు పడవలు, ట్రాక్టర్లలో రాకపోకలు సాగిస్తున్నారు.
పి. గన్నవరం మండలంలోని బూరుగుల్లంక, జి.పెదపూడి లంక, అరిగిలవారి పేటలకు వెళ్లేందుకు ఏటి గట్టు నుంచి పడవల్లో వెళ్లి కొద్ది దూరం నడచి.. అక్కడి నుంచి వశిష్ఠ గోదావరి పాయ వరద ఉధృతిలో ప్రయాణించి వారు ఒడ్డుకు చేరుతున్నారు. కె. ఏనుగుపల్లి లంకలోకి వరద పోటెత్తింది. రహదారిపై పొంగి పొర్లిన నీటిలోనే ప్రమాదకరంగా నడుస్తున్నారు. వెదురుబీడెం కాజ్‌వేపై భారీగా వరద చేరింది. అయినివిల్లి లంకల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ.. నాటు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. తొత్తరమూడి, పెదలంక, వీరవల్లిపాలం కొత్త కాలనీలోకి నీరు చేరింది.
ముమ్మిడివరం పరిధిలోని.. పొట్టిలంక, గురజాపులంక, లంక ఆఫ్ ఠానేలంక, కూనా లంకలను వరద నీరు ముంచేసింది. వేల ఎకరాల్లో కూరగాయలు, అరటి, బొప్పాయి తదితర పంటలు నీట మునిగాయి. నదీ తీరం వెంబడి.. సారవంతమైన భూములను విరిచేస్తోంది. గౌతమీ గోదావరి తీరంలోని ఆలమూరు మండలం బడుగువాని లంక, కపిళేశ్వరపురం మండలం కేదార్లంక, అయినవిల్లి మండలం పొట్టిలంక, ఐ. పోలవరం మండలం ఎదుర్లంక వద్ద నదీ కోత తీవ్రంగా ఉంది. పంటపొలాలు గోదారిలో కలిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
మామిడికుదురు మండలం అప్పనపల్లి- పాశర్లపూడి కాజ్‌వేపై వరద ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. బి. దొడ్డవరం, పెదపట్నంలంక వాసులు.. నాటు పడవల్నే ఆశ్రయిస్తున్నారు. సఖినేటిపల్లి మండలంలోని అప్పనరామునిలంక, పల్లిపాలెం లోతట్టు ప్రాంతాల్ని వరద చుట్టుముట్టింది. వరద పెరిగే కొద్దీ పశువులపైనా తీవ్ర ప్రభావం పడింది. లంకలు, పొలాల నుంచి పశువుల్ని ఏటి గట్టుపైకి తీసుకొచ్చారు. వాటికి పశుగ్రాసం అందించడం కష్టంగా మారింది.
కోనసీమ జిల్లా వ్యాప్తంగా 71 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా కేవలం 9 చోట్ల మాత్రమే స్థానికులకు వండి అందించారు. కొన్ని లంక గ్రామాల్లో ఇళ్లలోకి నీరు రాకపోయినా.. ఇళ్ల చుట్టూ బయటకు రాకుండా చేరింది. ముమ్మిడివరం పరిధిలోని కూనా లంకలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఆదివారం కూడా గోదావరికి భారీ వరద ధవళేశ్వరం ఆనకట్టకు చేరనుంది. మరి కొన్ని రోజులు వరద ఉధృతి కొనసాగనుంది.