ARREST: కోనసీమ జిల్లా పేరు మార్పు విషయమై అమలాపురంలో గత నెల 24న జరిగిన అల్లర్లకు సంబంధించి మరో 18 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ఒక బాలుడు ఉన్నాడని.. దీంతో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 217 మందికి చేరినట్లు వెల్లడించారు. మరికొంతమంది నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ.. జరిగింది : గత నెల 24న కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
సెక్షన్ 144, 30 పోలీస్ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ గత నెలలో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
'కోనసీమ ముద్దు - వేరే పేరు వద్దు' అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళకారులు అన్ని వైపుల నుంచి పట్టణంలోకి చొచ్చుకొచ్చారు. బస్టాండ్‌తో పాటు ముమ్మిడివరం వైపు నుంచి గడియారం స్తంభం వద్దకు ప్రదర్శనగా చేరుకున్నారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు యత్నించారు. లాఠీలతో చెదరగొట్టారు. అయినా నిరసనకారులు వెనకడుగు వెయ్యలేదు. సమయం గడిచేకొద్దీ వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఇవీ చదవండి: