How to Study for 10th Class and Inter Exams: పది, ఇంటర్ పరీక్షలు దగ్గరపడటంతో ఉత్తమ మార్కులు సాధించేందుకు విద్యార్థులు రేయింబవళ్లు చదువుతుంటారు. చాలామంది ర్యాంకులు సాధించాలన్న తపనలో ఒత్తిడితో కూడా చదువు కొనసాగిస్తున్నారు. చదువులో రాణించలేమన్న భయంతో మరికొందరు డిప్రెషన్స్‌కు లోనవుతుంటే ఇంకొందరు ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి భయం పోగొట్టేందుకు కొన్ని విద్యాసంస్థలు మోటివేషనల్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో చదివితే సులువుగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించవచ్చని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
అహర్నిశలు చదువుతున్న విద్యార్థులు: పదవ తరగతి పరీక్షలంటే విద్యార్ధులు వణికిపోతుంటారు. ఉత్తమ మార్కులు సాధించాలని అహర్నిశలు చదవటంతో కొందరు ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రధానంగా ఎక్కువ మంది విద్యార్థులు ప్రధాన పరీక్షలంటే కంగారు పడుతుంటారు. దీంతో చదివింది కూడా మరిచి పోతుంటారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు జరగనున్నాయి.
ఇప్పటికే పరీక్షలకు ప్రిపరేషన్ మెుదలు పెట్టిన విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకునేందుకు పోటీ పెట్టుకుని మరీ చదువుతున్నారు. అయితే మంచి మార్కులు తెచ్చుకోవాలంటూ పాఠశాలల్లో టీచర్లు, ఇళ్లలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుంటారు. ఈ ప్రభావం పిల్లల మానసిక పరిస్థితిపై పడి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.
ఒత్తిడి తగ్గించేలా మోటివేషనల్ సెషన్స్: విద్యార్ధుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని విద్యాసంస్థలు మానసిక వికాసంపై ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయి. విద్యార్ధుల్లో భయం పోగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని టీచర్లు, విద్యాసంస్థల అధినేతలు తెలిపారు. విద్యార్ధుల్లో మనోధైర్యం, ఏకాగ్రత పెంచితే కచ్చితంగా పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను మార్కుల కోసం కాకుండా చదువుపై శ్రద్ధ పెరిగేలా చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
పదేపదే పిల్లలపై ఒత్తిడి తెస్తే మార్కులు సాధించలేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, భయం పోవాలని మానసిక వైద్యులు చెబుతున్నారు.
వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు - ఇలా డౌన్లోడ్ చేసుకోండి