Kakinada Government Hospital: కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి నిత్యం సుమారు 3 వేల మంది రోగులు వస్తుంటారు. అందులో దాదాపు సగం మంది ఆసుపత్రిలో ఉండి వైద్య సేవలు పొందుతుంటారు. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ మన్యం వాసుల అత్యవసర వైద్య సేవలకు కాకినాడ జీజీహెచ్‌నే ఆశ్రయిస్తుంటారు. అలాంటి కీలకమైన ఈ ఆసుపత్రి పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో సమస్యల నిలయంగా మారింది. కొన్ని నెలలుగా రక్త పరీక్షల పరికరాలు, థైరాయిడ్, ఎమ్ఆర్ఐ స్కానింగ్ యంత్రాలు పని చేయక రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో వేల రూపాయలు చెల్లించలేక... నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
24 గంటల రక్తపరీక్షల ల్యాబ్‌లో యంత్రం మెురాయించి సుమారు 10 నెలలు అవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని రోగులు వాపోతున్నారు. థైరాయిడ్ వ్యాధి నిర్థారించే యంత్రం కూడా ఏడాదిన్నరగా మూలన పడింది. చిన్న పిల్లల వార్డులో పాడైన వెంటిలేటర్లు, వార్మర్స్ ఫొటోథెరఫీ పరికరాలకు మరమ్మతులు కూడా చేయడం లేదని రోగులు వాపోతున్నారు. మాతా శిశు విభాగంలోని మూడు యూనిట్లలో180 పడకలు అందుబాటులో ఉండగా... ఒక మంచంపై ఇద్దరు, ముగ్గురిని ఉంచి వైద్యం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ వార్డ్‌లో లిఫ్ట్ ఆరు నెలలుగా మొరాయించడంతో రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఆస్పత్రిలో సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. నిత్యం వేలాది మంది వచ్చే కాకినాడ జీజీహెచ్‌లోని మూలన పడిన యంత్రాలు, పరికరాల్ని వెంటనే బాగుచేసి, మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు.
ఇవీ చదవండి:
నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి.. పలువురు ఐఏఎస్‌ల బదిలీ
ఈ చిన్నారి ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ అప్పుడేమో బబ్లీ బ్యూటీ ఇప్పుడేమో నాజూకుగా