Sand Mining : ఇసుక వ్యాపారంలో ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్‌కీ సంస్థను గత ఏడాది ఆగస్టులో ఉన్నపళంగా వైదొలిగేలా చేశాక జిల్లాల వారీగా నేతలకు ఇసుక తవ్వకాలు, విక్రయాలను అప్పగించారు. అయితే అప్పట్లో రాష్ట్ర స్థాయిలో ఎవరు పర్యవేక్షణ చేస్తారనే సందిగ్ధత నెలకొన్నట్లు తెలిసింది. దీంతో కాకినాడకు చెందిన నేతను ఇందులోకి తీసుకొచ్చారని సమాచారం. అప్పటికే ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో.. ఆయన ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో తొలుత బ్రాక్స్‌టన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత కేకేఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్లను ఉపగుత్తేదారుగా చూపుతూ వాటి పేరిట కొద్ది రోజులు వేబిల్లులు జారీచేశారు.
ఈ రెండు సంస్థలకు విజయవాడ గురునానక్ కాలనీలోని ఒకే చిరునామా చూపారు. జీఎస్టీ విషయంలో సమస్యలు రావడం, టర్న్‌కీ స్థానంలో కొత్త సంస్థలను ఉపగుత్తేదారుగా అంగీకరించబోమని ప్రధాన గుత్తేదారు జేపీ సంస్థ తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో చివరకు మళ్లీ టర్న్‌కీ సంస్థకు చెందిన పెద్దలతో సంప్రదింపులు చేసి.. ఆ సంస్థను పూర్తిగా కాకినాడకు చెందిన నేతకు అప్పగించేలా చూశారని సమాచారం. అప్పటి నుంచి మళ్లీ టర్న్‌కీ పేరిటే వేబిల్లుల జారీ మొదలైంది.
ప్రస్తుతం రాష్ట్ర మంతా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు, జిల్లా సిండికేట్లు, రాష్ట్ర సిండికేట్ ఇలా అన్నీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చూస్తున్నారని ఇసుక వ్యాపారులు చెబుతుంటారు. అయితే కాకినాడకు చెందిన నేతే.. ఆ వ్యక్తిని తెర మీద చూపిస్తూ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి జిల్లా సిండికేట్ల నుంచి ప్రతి 15 రోజులకు ఓ సారి డబ్బులు వసూళ్లు చేయడం, వాటిని హైదరాబాద్‌లోని కొందరు పెద్దలకు చేరేవేసేలా చూస్తున్నారని సమాచారం. అతనికి కాకినాడకు చెందిన నేత సోదరుడు సహకారం అందిస్తున్నారని తెలిసింది. వీళ్లు విజయవాడ వెటర్నరీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి తరచూ వస్తుంటారని సమాచారం.
sand mines subleased : పేరుకే జేపీ.. పెత్తనం అంతా వైఎస్సార్సీపీ..! ఇసుక మాఫియా దారుణాలు అనేకం
రాష్ట్రంలో మూడు జోన్లలో ఇసుక వ్యాపారాన్ని 2021, మే నుంచి జయ్‌ప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఆరంభించింది. అయితే చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ కొత్తగా పుట్టుకొచ్చి, వెంటనే ఉపగుత్తేదారుగా రంగప్రవేశం చేసింది. దాని ఆధీనంలోనే ఇసుక దందా సాగింది. గత ఏడాది ఆగస్టులో ఆకస్మికంగా టర్న్‌కీని ఇసుక వ్యాపారం నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి టర్న్‌కీని ఉపగుత్తేదారుగా కొనసాగుతున్నట్లు చూపిస్తున్నారు. దాని పేరిటే బిల్లులు జారీ అవుతున్నాయి. దీని వెనుక ఆంతర్యం ఏమిటి అనేది లోతుగా పరిశీలిస్తే.. కాకినాడ నేత పాత్ర వెలుగులోకి వచ్చింది.