Kakinada Port Lands Collateral: అభివృద్ధి పేరిట అప్పుల కోసం ప్రభుత్వం భూముల్ని తనఖా పెట్టే సంస్కృతి విశాఖ నుంచి కాకినాడ వరకు పాకింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో ఆగమేఘాల మీద భూములపై నిషేధం తొలగించి తనఖాకు మార్గం సుగమం చేశారు. కాకినాడ జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల 337.83 ఎకరాలు తాకట్టు పెట్టి 15 వందల కోట్ల రుణం పొందే వెసులుబాటు ఏపీ మారిటైం బోర్డుకు కల్పించారు. తాకట్టు పెట్టిన నిధులు పారిశ్రామిక అభివృద్ధికి పుష్కల అవకాశాలున్న కాకినాడలో వినియోగించకుండా రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల కోసం వెచ్చించడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.
సర్వేయర్ క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ఇచ్చిన నివేదికను తోసిపుచ్చి పున:పరిశీలన పేరిట నిషేధిత భూములకు పచ్చజెండా ఊపడం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల లిఖితపూర్వక ఆదేశాలు లేకుండానే కొన్ని భూములకు సబ్ రిజస్ట్రార్ కార్యాలయం నుంచి గ్రాంట్ ఇచ్చారన్న వాదన ఉంది. మార్ట్ గేజ్ డీడ్‌లో పేర్కొన్న భూములన్నీ పోర్టువేనని అధికారులు చెబుతుంటే తమ పరిధిలో అసలు పోర్టు భూములే లేవని గ్రాంట్ ఇవ్వలేదని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు వెల్లడించడం విశేషం. పోర్టు భూములతోపాటు ఇతర ప్రభుత్వ భూములకూ రెక్కలొచ్చాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే కాకినాడ నగర, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలకు రక్షణ కరవైంది. భూదాన్ భూములు, విద్యా సంస్థల భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. జడ్పీ భూముల్లోనూ ఆక్రమణలు ముసిరాయి. రాజకీయ ప్రాబల్యంతో కొలువుదీరిన కొందరు అధికారులు ఈ దూకుడుకు లోపాయికారీ ఊతమిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: