lathi charge on villagers of Achyutapuratrayam: మట్టి లారీలను నిలిపివేయాలంటూ నిరసన చేపట్టిన గ్రామస్థులపై, చిన్నారులపై పోలీసులు లాఠీఛార్జి చేసి, విచక్షణరహితంగా కొట్టారని.. కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతపురత్రయం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి లారీల వల్ల గ్రామంలోని ప్రజలు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. భారీ లోడ్లతో వేగంగా వెళ్తున్న లారీలను వెంటనే నిలిపివేయాలని గుత్తేదారుడిని ప్రశ్నించగా.. దురుసుగా సమాధానం చెప్తున్నారంటూ ఆవేశానికి గురయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 'కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతపురత్రయం మీదుగా వెళ్తున్న భారీ మట్టి లారీలను నిలిపివేయాలని గ్రామస్థులు సోమవారం రాత్రి ఆందోళన నిర్వహించారు. వేగంగా వెళ్తున్న ఓ లారీలోంచి మట్టిదిమ్మె మీదపడి గ్రామానికి చెందిన గోపాలకృష్ణ దంపుతులు బైక్ మీద నుంచి కిందపడ్డారు. దీంతో గుత్తేదారుడిని ప్రశ్నించగా.. దురుసుగా సమాధానం చెప్పారంటూ గ్రామస్థులు లారీలను అడ్డుకున్నారు. రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పెదపూడి ఎస్సై వాసు.. తన సిబ్బందితో కలిసి గ్రామస్థులపై లాఠీఛార్జి చేశారు. అంతేకాదు, మహిళలను లాఠీలతో కొట్టి, దుర్భాషలాడారు' అని గ్రామస్థులు తీవ్రంగా మండిపడ్డారు.
అనంతరం ఎస్సై తీరును నిరసిస్తూ.. గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్..ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎస్సైని సస్పెండ్ చేయనిదే తాము ఆందోళన విరమించమంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీంతో లాఠీఛార్జి చేసిన పోలీసులపై నేడు డీఎస్పీ కార్యాలయంలో విచారణ చేపడతామని సీఐ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. సీఐ శ్రీనివాస్ హామీతో ఆందోళన సద్దుమణిగింది.
ఇవీ చదవండి