Bond trader attacked : వాహనంపై నమోదైన జరిమానా చెల్లించాల్సిందిగా రవాణా శాఖ అధికారి ఒత్తిడి చేయడం.. ఆ వ్యాపారికి ఆగ్రహం తెప్పించింది. నిత్యం రోడ్డు వెంట వ్యాపారం చేస్తుండగా అప్పటికే సదరు వాహనంపై ఆర్టీఏ అధికారులు ఫైన్ వేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బొండాలు విక్రయిస్తుండగా.. ఆర్టీఏ అధికారి అక్కడకు చేరుకుని ఫైన్ చెల్లించాలని, వాహనం ఫిట్ నెస్ సర్టిఫికెట్ చూపించాలని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన వ్యాపారి దుర్గారావు బొండాలు కొట్టే కత్తితో విరుచుకు పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారి వాహన డ్రైవర్ సైతం గాయపడ్డాడు.
ప్రధాన సెంటర్ లో ఉదయం వేళ.. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. వాహనాల రద్దీ కూడా అంతంత మాత్రమే.. అప్పటికే వ్యాపారి, అధికారికి మధ్య గొడవ జరుగుతుండడంతో అటుగా వెళ్లేవారు గమనిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి పాల్పడడం స్థానికంగా భయభ్రాంతులకు గురిచేసిందని స్థానికులు తెలిపారు.
రవాణా శాఖ అధికారి, డ్రైవర్‌పై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కాకినాడలో కలకలం రేపింది. ఎండోమెంట్ సెంటర్ వద్ద దుర్గారావు అనే వ్యక్తి ఆటో మినీ వ్యానులో కొబ్బరి బొండాలు అమ్మతున్నాడు. ఇతని వాహనంపై గతంలో జరిమానా విధించారు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ చిన్నారావు ఉదయం వాహనం వద్దకు వచ్చి జరిమానా చెల్లించాలని అడిగారు.
ఇద్దరిపై దాడి... ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దుర్గారావు కత్తితో రవాణా శాఖ అధికారిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన కారు డ్రైవర్ పైనా కత్తివేటు పడింది. కారు డ్రైవర్ వీరబాబు బొటన వేలు తెగి కింద పడింది. రెండు చేతులకు గాయాలయ్యాయి. రవాణా అధికారి చిన్నారావు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు. చిన్నారావు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలిని, జీజీహెచ్‌ను ఏఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. నిందితుడు దుర్గారావు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దుర్గారావు టాటా ఏస్ బండి మీద కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్నాడు. అతడి వాహనంపై జరిమానా ఉన్నదని, దానిని చెల్లించాలని ఎంవీఐ చిన్నారావు వచ్చి అడుగుతున్న క్రమంలో ఊహించని పరిణామం చోటు చేసుకుని దాడి జరిగినట్టు తెలుస్తోంది. చిన్నారావును వెంటనే జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నాం. దాడికి పాల్పడిన నిందితుడు దుర్గా ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు దిశగా చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీనివాసరావు, ఏఎస్పీ, కాకినాడ జిల్లా
ఇవీ చదవండి :