YSRCP Sarpanches Comments on CM Jagan: రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పని చేస్తామని వైసీపీ సర్పంచులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని మంగళగిరిలో నిర్వహించారు. ఈ సదస్సులో వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్న సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సర్పంచుల రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరైన పలువురు వైఎస్సార్సీపీ సర్పంచులను, సస్పెండ్ చేస్తున్నట్లు ఫోన్లకు సందేశాలు వచ్చాయని వారు వివరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో వేదిక పంచుకున్నందుకు ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులను వైఎస్సార్సీపీ సస్పెండ్ చేసిందని వారు వెల్లడించారు. తమను సస్పెండ్ చేశారనే విషయాన్ని వేదిక మీద ప్రకటించిన సర్పంచులు, ఆ పార్టీకీ తామే స్వయంగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్రమంత్రికి నిరసన సెగ - క్షమాపణ చెప్పాలంటూ సర్పంచ్ల నినాదాలు
అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని పెందుర్తి నియోజకవర్గంలోని ముత్యాలమ్మపాడు గ్రామ వైఎస్సార్సీపీ సర్పంచ్ చింతకాయల ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వారి సమస్యలను తమకు విన్నవిస్తుంటే, నిధులు లేవని చెప్పటానికి సిగ్గు అనిపించి గ్రామంలో ముఖం చాటేస్తున్నామని మరో వైసీపీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేసినా ముఖ్యమంత్రిలో చలనం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలంటేనే అసహ్యమనిపించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని దుయ్యబట్టారు. ఇంకెప్పుడూ వైకాపా కండువా కప్పుకునేందుకు సిద్ధంగా లేమని మరికొందరు సర్పంచులు తేల్చిచెప్పారు. ప్రజలు సర్పంచులకు ఓట్లేసి గెలిపిస్తే, ముఖ్యమంత్రి సర్పంచుల నిధులు దోచుకున్నారని విమర్శించారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా తాము పనిచేస్తామని వైఎస్సార్సీపీ సర్పంచులు స్పష్టం చేశారు.
"కేసీఆర్కు పట్టిన గతే జగన్కు - సర్పంచుల సదస్సుకు ముఖ్య అతిథిగా చంద్రబాబు"
డమ్మీ చెక్కులను ఎక్కడ పడేయాలో తెలియకుండా మిగిలిపోయామని కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్ సర్పంచ్ అమార్జా హా బేగం ధ్వజమెత్తారు. సర్పంచుల వ్యవస్థ భ్రష్టు పట్టిందనటానికి రాష్ట్రామే నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని ఓ దొంగ పాలిస్తూ, సర్పంచుల నిధులనూ దొంగలించాడని దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా సర్పంచులంతా హక్కుల కోసం ఏకమవుతామని వెల్లడించారు.
సర్పంచులకు నిధులు లేకపోవడంతో కనీస మర్యాద కూడా దక్కడం లేదని కడప జిల్లాకు చెందిన కొండయ్య అనే సర్పంచ్ ధ్వజమెత్తారు. ప్రజల నుంచి సర్పంచులు తప్పించుకుని తిరగే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీ పెద్దలైనా తమ గోడు వినాలని మొర పెట్టుకుంటున్నామన్నారు.
AP Sarpanches Meeting: 'నిధులివ్వకుంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం..'