YSRCP Govt Neglecting SC People: పేద పిల్లలు ఏ బాదరబందీ లేకుండా చదవుకోవడానికి గురుకులాలు చక్కటి అవకాశం. అణగారిన వర్గాల పిల్లలు గురుకులాల్లో సీటు పొందితే వారి దశ తిరిగినట్టే అనే ధీమా తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఇలాంటి గురుకులాలు కొత్తగా ఎన్ని వస్తే ఆయా వర్గాలకు అంత మేలు. దీన్ని ఒడిసిపట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం.. దళిత బిడ్డల కోసం సాంఘిక సంక్షేమ గురుకులాలను ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆ ప్రాంతంలో 134 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉంటే.. ఈ 9 ఏళ్లలోనే అదనంగా మరో 104 ఏర్పాటు చేసింది. ఇంటర్‌తోనే వారి విద్య ఆగిపోకూడదనే ఆలోచనతో 30 మహిళా డిగ్రీ కళాశాలలను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. మొత్తంగా ఎస్సీ గురుకులాల సంఖ్య తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 268కి పెంచింది.
తెల్లారింది మొదలు నా ఎస్సీలు.. నా ఎస్సీలు అంటూ గుండెలు బాదుకునే జగన్.. ఈ నాలుగేళ్ల పాలనలో కొత్తగా తీసుకొచ్చిన సాంఘిక సంక్షేమ గురుకులం ఒక్కటంటే ఒక్కటే. పైగా తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో మంజూరు చేసిన 15 కొత్త గురుకులాలనూ ఏర్పాటు చేయలేదు. ఇక కొత్త డిగ్రీ కళాశాలల సంగతి సరేసరి. గత ప్రభుత్వం హయాంలో 90శాతం గురుకుల భవనాలు పూర్తిచేయగా.. ఈ నాలుగున్నరేళ్లలో మిగిలిన పనులను కూడా పూర్తి చేయలేకపోయారు.
రాష్ట్రంలో ఎస్సీల నుంచి ఉప ముఖ్యమంత్రి సహా అయిదుగురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలున్నా ఏం లాభం లేకుండా పోయింది. ఆఖరికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున నియోజకవర్గానికి మంజూరుచేసిన గురుకులాన్నీ సైతం ఆయన ఏర్పాటు చేసుకోలేకపోయారు.
మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏర్పాటు చేసిన గురుకులాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయి. 2014లో గురుకులాల్లో 64వేల 230 మంది విద్యార్థులు చదవగా.. కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో కలిపి ఆ సంఖ్య లక్షా 52 వేల345కు చేరింది. ఎస్సీ బాలికల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తం 268 గురుకులాల్లో 146 బాలికలకు సంబంధించినవే. 30 డిగ్రీ కళాశాలలూ మహిళల కోసమే ఏర్పాటు చేసింది.
గురుకులాల్లో అత్యంత ప్రతిభావంతులు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పొందేందుకు 27 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఫైన్స్‌ఆర్ట్స్, సైనిక్ స్కూల్‌తో పాటు మహిళల కోసం ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కళాశాలను నెలకొల్పింది. కోడింగ్ స్కూల్, ఎర్త్‌స్కూల్, ఒకేషనల్ స్కూల్‌తోపాటు ఫ్రీడం స్కూళ్లను ప్రారంభించింది. గురుకులాల్లోని విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వైద్యనిపుణుల ఆధ్వర్యంలో 24 గంటలు పనిచేసే పానేషియా హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులను ఇంటర్న్‌షిప్ కోసం విదేశాలకు పంపిస్తున్నారు. ఫార్మసీ, లా, ఫైన్‌ఆర్ట్స్, ప్రత్యేక కళాశాలలు నడుస్తున్నాయి. రుక్మాపూర్‌లో ఎస్సీ గురుకులం నెలకొల్పిన సైనిక పాఠశాల ఇటీవలే రక్షణశాఖ పరిధిలోకి వచ్చింది. విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్దేందుకు స్టూడెంట్ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తోంది. వేసవి సెలవుల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది.
ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారు జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించి ఉన్నతస్థాయికి ఎదిగేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ జగన్ మాత్రం వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ.. అందరికీ అందించే పథకాలనే ఎస్సీలకు ఇస్తూ వారిని ఉద్దరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. వారి అభివృద్ధికి ప్రత్యేకంగా ఏమీ చేయటం లేదు.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం హయాంలో 15 గురుకులాలు ఏర్పాటు చేస్తే.. జగన్ తెచ్చింది మాత్రం ఒకే ఒక్కటి. 2014- 2019 మధ్య ఏర్పాటు చేసిన 15 గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ పిల్లలకు అద్దె భవనాలు, అరకొర వసతుల బాధను తప్పించేందుకు అన్ని వసతులతో కూడిన నిర్మాణాలను చేపట్టింది. 100 కోట్ల ఉప ప్రణాళిక నిధుల్ని ఖర్చుచేసి సకల సౌకర్యాలతో భవనాల్ని నిర్మించి ఇచ్చింది.
చింతలపూడి, అరుగొలను, సత్తెనపల్లి, కురిచేడు, బ్రహ్మంగారిమఠంలో 60 నుంచి 90 శాతం భవన నిర్మాణాలు పూర్తి చేసింది. ఆ మిగిలిన పనులు పూర్తి చేయడంపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక్కరే.. ఆయన నియోజకవర్గం డోన్‌లో ఒక గురుకులాన్ని ఎలాగోలా మంజూరు చేయించుకున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 15 గురుకులాలను మంజూరు చేసింది. ఒక్కో గురుకుల నిర్మాణానికి 33.50 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. కానీ జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రతిపాదనల్ని మూలనపడేశారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున సొంత నియోజకవర్గంలోనూ గురుకులాన్ని తెప్పించుకోలేకపోయారు. ఒక గురుకులం ఏర్పాటైతే 680 మంది విద్యార్థులకు మేలు జరిగినట్లే. ఈ 15 గురుకులాల్ని జగన్ ఏర్పాటు చేసి ఉంటే, ఒక్క ఏడాదికే 10వేల మందికి అదనంగా నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉండేది.
ఏటా వేలమంది ఎస్సీ విద్యార్థులు గురుకులాల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకుని సీట్లు రాక నిరాశ చెందుతున్నారు. తమ ప్రాంతంలో గురుకులాల ఏర్పాటు కోసం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ప్రతిపాదనలు పంపినా.. అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ గురుకులాల వివరాలతో వెబ్‌సైట్ ఏర్పాటు చేయగా.. రాష్ట్ర ఎస్సీ గురుకులాలకు ఇప్పటికీ వెబ్‌సైట్ లేదు. గురుకులాలకు సంబంధించిన ఏ వివరాలనూ అధికారులు బయటపెట్టరు. అన్నీ గోప్యమే. ఇదేనా పారదర్శక పాలన అంటే? ఇక ఈ విద్యాలయాల పర్యవేక్షణకు ఒక్క ఐఏఎస్ అధికారిని నియమించిన దాఖలాలు లేవు.
Gang Rape SC Woman: స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఒంటరి మహిళపై ఏడాదిగా ఆరుగురు అత్యాచారం