YSRCP Govrnment Neglecting on Amaravathi: ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్ జలమయమైంది. చెన్నై, ముంబయి, బెంగళూరు లాంటి మహానగరాలూ గతంలో ముంపు బారినపడ్డాయి. వైసీపీ ప్రభుత్వం ఈ జాబితాలో అమరావతినీ చేర్చాలనుకుంటుందా అనే అనుమానం కలుగుతోంది. అమరావతి ముంపు ప్రాంతమంటూ ఆది నుంచీ సాగించిన దుష్ప్రచారాన్ని నిజం చేయాలనుకుంటుందా అనే సందేహం కలిగినప్పుడు.. ఔననే అంటున్నారు అమరావతి రైతులు. కొండవీటి వాగు ఆధునీకరణ పనులు ఆపేయడం, నాలుగేళ్లుగా కనీసం ఇతర వాగుల్లో గుర్రపుడెక్క తొలగించకపోవడం.. కావాలని అమరావతిని ముంచే కుట్ర అని అనుమానిస్తున్నారు. ప్రభుత్వంపై సంఘటిత పోరాటానికి రైతులు సిద్ధమయ్యారు.
పూడిపోయిన తూములు, పూర్తిగా కమ్మేసిన పిచ్చిమెక్కలు, అల్లుకుపోయిన గుర్రపుడెక్క.. ఇదీ అమరావతి రాజధాని మీదుగా ప్రవహిస్తున్న.. కొండవీటివాగు, కొటేళ్లవాగు, పాలవాగుల వాగుల దుస్థితి. గత నాలుగేళ్లులో ప్రభుత్వం ఒక్కసారి కూడా ఈ వాగుల్లోని గుర్రపుడెక్క, తూడుకాడ, పిచ్చిమొక్కలను తొలగించలేదు. రాజధాని ప్రాంతంపై ప్రభుత్వ పెద్దలు పెంచుకున్న ద్వేషం.. కొండవీటి వాగు పరీవాహక ప్రాంత గ్రామాలు, పొలాలకు శాపంగా మారింది.
గుర్రపుడెక్కలతో నిండిన కాలువ.. పట్టించుకోని అధికారులు.. ఇబ్బందుల్లో రైతులు
ప్రవాహనికి అడ్డుగా పెరిగిన మొక్కలు: కొండవీటివాగు వరద నుంచి రాజధాని ప్రాంతానికి రక్షణ కల్పించేందుకు ప్రకాశం బ్యారేజీ వద్ద గత ప్రభుత్వం 237 కోట్ల రూపాయల వ్యయంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. కాకపోతే ఇప్పుడా వరద ప్రవాహం ఎత్తిపోతల పథకం మోటార్ల వరకూ వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. వాగుల్లో గుర్రపుడెక్క పెరిగిపోవడంతో ప్రవాహం సాఫీగా కిందకు వెళ్లేందుకు ఈ పిచ్చిమొక్కలు అడ్డుగా ఉన్నాయి.
అమరావతిని ముంచేందుకే ప్రభుత్వ కుట్ర: భారీ వర్షాలు పడితే వాగులు ఎక్కడికక్కడ పొంగే ప్రమాదం ఉంది. వర్షపునీరు వెనక్కి ఎగదన్ని పొలాలు, పరివాహక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. అమరావతి మునిగిపోతుందనే దుష్ప్రచారాన్ని నిజం చేసేందుకే.. ప్రభుత్వం ఇలా చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.
"కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ నీళ్లను పంపించటానికి పెద్ద సమస్య వచ్చేది. దానికి పరిష్కారం కనుక్కుని మోటర్లు బిగించారు. ఇప్పుడు అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేశారు. నదులు పొంగితే పొలాలు, ఇళ్లస్థలాలు మునిగిపోకుండా కాపాడాలని కోరుకుంటున్నాము." -రైతు
"ఈ వాగులు శుభ్రం చేస్తే నీళ్లు ఇందులో నిలిచిపోకుండా కిందకి వెళ్లిపోతాయి. వర్షం పడితే పంటలు మునిగిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పొలాలు సాగుచేసుకుంటున్నాము." -రైతు
ప్రభుత్వ కుట్రలపై రైతులు అప్రమత్తం అయ్యారు. తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని కొండవీటి వాగు పరీవాహక ప్రాంత రైతులు సంఘటితమయ్యారు. వాగుల్లో ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలంటూ ఉద్యమ కార్యాచరణ అమలు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు.
Krishna Delta Canals: గుర్రపుడెక్క.. చెత్త చెదారం.. నాలుగేళ్లుగా అదే తీరు
వంతెన, కల్వర్టుల నిర్మాణాలను గాలికోదిలేసిన వైసీపీ ప్రభుత్వం: నిజానికి కొండవీటివాగు, కోటేళ్లవాగు, పాలవాగుల అభివృద్ధికి గత ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది. వాటిని జల విహారానికి, జల క్రీడలకు నెలవులుగా సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వాగుల మీద వంతెనలు, కల్వర్టుల నిర్మాణం చేపట్టింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేసింది. అసంపుర్ణంగా ఉన్న వంతెనల నిర్మాణాలు నీటిలో తేలుతున్నాయి. రాజధాని నిర్మాణం మొదలవక ముందు జల వనరులశాఖ ముంపు నివారణ పనులు చేపట్టేది. ఇప్పుడా బాధ్యత చూడాల్సిన సీఆర్డీఏ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.
ప్రకాశం బ్యారేజీలో వాగుల కలయిక: మేడికొండూరు మండలంలోని కొండల్లో రెండు చిన్న పాయలుగా మొదలయ్యే కొండవీటివాగు.. లాం గ్రామం వద్దకు వచ్చేసరికి ఉద్ధృతమవుతుంది. అక్కడి నుంచి రాజధాని ప్రాంతం మీదుగా 29 కిలోమీటర్లు ప్రవహించి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, తుళ్లూరు సమీపంలో పాలవాగు వచ్చి ప్రకాశం బ్యారేజిలో కలుస్తాయి.
కొత్తవి నిర్మించకపోయిన ఉన్న వాటిని సజావుగా వాడండి: ప్రకాశం బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించకముందు.. వర్షాకాలంలో హఠాత్తుగా వచ్చే కొండవీటి వాగు ఉద్ధృతికి పలు ప్రాంతాలు నీట మునిగేవి. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు మొదటి ప్రాధాన్యంగా యుద్ధ ప్రాతిపదికన ఎత్తిపోతల పథకం పూర్తి చేశారు. వరద ముంపునకు పరిష్కారం దొరికిందని రైతులు సంబరపడ్డారు. కానీ.. ఇప్పుడా ఎత్తిపోతల పథకాన్నీ నిరుపయోగంగా మార్చారని ఆక్రోశిస్తున్నారు. అమరావతిలో కొత్తవి నిర్మించకపోయినా కనీసం ఉన్నవాటినైనా సజావుగా వాడాలని రైతులు కోరుతున్నారు.