YCP Neglecting SC ST BC Communities: నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలంటూ సీఎం జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడతారు. అంతేకాకుండా వీరితో పాటు మహిళలకు 50శాతం పదవులు ఇస్తామని ఘనంగా ప్రకటిస్తారు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. అధికార పార్టీ వైసీపీలో ఇటీవల మండలాల అధ్యక్ష పదవులు ప్రకటించారు. ఇందులో రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని.. 51శాతం వరకు పదవులను ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం చర్చనీయాంశమైంది.
వైసీపీ పాలనలో అన్ని కులాలకు సమప్రాధాన్యం ఉంటుందని తరచూ చెప్పుకునే జగన్.. ఇటీవల ప్రకటించిన ఆ పార్టీ మండలాల అధ్యక్ష పదవులతో వైసీపీ విధానమెంటో తేటతెల్లమైంది. సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోని ఎనిమిదింటిలో.. 7 పదవులను ఒకే సామాజికవర్గం వారికి కట్టబెట్టారు. జమ్మలమడుగు, కమలాపురం, ఆత్మకూరు, బనగానపల్లె లాంటి నియోజకవర్గాల్లో అయితే.. 100కి 100శాతం పదవులు అదే సామాజికవర్గానికి చెందినవారికి కట్టబెట్టారు.
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలోనూ.. ఇంకా విడ్డూరమేంటంటే.. మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన యర్రగొండపాలెంలోని అన్ని మండలాల పదవులూ ఒక సామాజికవర్గం వారికే దక్కాయి. పూతలపట్టులోనూ ఇదే తంతు. బద్వేలు, నందికొట్కూరు, సూళ్లూరుపేట లాంటి రిజర్వుడు నియోజకవర్గాల్లో ఒకటి రెండు మండలాలకు తప్ప మిగిలిన వన్నీ ఆ సామాజికవర్గానికే అప్పజెప్పారు.
ఎస్సీ, బీసీ, మైనారిటీలు, మహిళలు.. మొత్తంగా మహిళలకు 50శాతం పదవులు అంటూ సీఎం జగన్ పదేపదే చెబుతుంటారు. దేవాలయాల పాలక మండళ్లలోనూ 50శాతం పదవులను మహిళలకు ఇస్తున్నామంటారు. మరి రాజకీయంగా ఎదిగేందుకు పార్టీలో పదవులు మాత్రం ఇవ్వరు. వైసీపీ మండలాల అధ్యక్ష పదవుల్లో రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తమ్మీద మహిళలకు ఇచ్చిన పదవులు రెండంటే రెండు మాత్రమే.
ఒక్క సామాజికవర్గానికే అధిక శాతం: వైయస్ఆర్ జిల్లాలోని పదవుల్లో 75శాతం ఒక్క సామాజికవర్గానికే ఇచ్చేశారు. రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 48శాతం, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 58శాతం పదవుల్లో ఆ వర్గానికే పట్టం కట్టారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన సూళ్లూరుపేటలో 63శాతం, గంగాధర నెల్లూరు, సత్యవేడు, కొండపిల్లో 50శాతం చొప్పున, రైల్వేకోడూరు, మడకశిరలో 40శాతం చొప్పున, శింగనమల, సంతనూతలపాడులో 33శాతం, కోడుమూరులో 25 శాతం పదవులను ఆ ఒక్క సామాజికవర్గానికే కట్టబెట్టారు.