సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. గుంటూరులో నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించిందని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా.శ్రీధర్ రెడ్డి తెలిపారు. అధిక మొత్తంలో ఉన్న యూనిట్లను.. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం గుంటూరు బ్రాంచ్ నుంచి తెలంగాణ రెడ్ క్రాస్ బ్రాంచ్‌కి 500 యూనిట్ల రక్తాన్ని నేడు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. గుంటూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో నుంచి రవాణాకి సిద్ధమైన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 35 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం అరుదైన రికార్డు అని ఆయన అన్నారు. ఒక్క గుంటూరులోనే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి.. 9780 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు.
కరోనా కష్టకాలంలో రక్త నిల్వలు పూర్తిగా పడిపోయాయని.. రక్త నిల్వలు లేక అనేకమంది ఇబ్బందులకు గురయ్యారని మధ్య విమోచన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ లక్షణరెడ్డి అన్నారు. రక్త నిల్వలు కొరతను అధిగమించడానికి సీఎం జగన్ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 21న రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో జనచైతన్య వేదిక - రెడ్ క్రాస్ సంయుక్తంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రెడ్ క్రాస్ సేవలను ఆయన అభినందించారు.